హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యంలో పత్రీకలు స్వచ్ఛందంగా రాస్తున్న వార్తలను జీర్ణించుకోలేక పత్రీకలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులను సమాజానికి మంచిది కాదన్నారు. జర్నలిస్టులు రాస్తున్న వార్తలను దురుద్దేశంతో ఆలోచిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణ పత్రికను టార్గెట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు, నమస్తేతెలంగాణ రాసిన వార్తలను తప్పుంటే చట్టరీత్యా చర్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ, బెదిరింపులకు పాల్పడడం, సరియైన విధానం కాదని, నమస్తే తెలంగాణకు పత్రికకు కేయూ విద్యార్థి జేఏసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అరాచకాలు చేస్తుంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. రాస్తున్న వార్తలకు నిజం లేనప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక బాధ్యత పోషిస్తుందని తప్పులను ఎత్తి చూపిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, దాడులకు పూనుకుంటున్నారని పోలీసులను వారు చేసినవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో అన్ని యూనివర్సిటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భౌతిక దాడులను ఖండిస్తున్నాయని, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు నమస్తే తెలంగాణపైన దాడిని ఖండిస్తున్నామని, కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బొందపెడతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఎంఎస్ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి, డీవైఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, డీఎస్ఏ రాష్ర్ట అధ్యక్షుడు కామగొని శ్రావణ్ కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వంశీ, ఏఐఎస్బీ సూర్య, ఎస్సీ, ఎస్టీ సంఘం కలకోట్ల సుమన్, విద్యార్థి నాయకులు కందికొండ తిరుపతి, బీసీ యువజన సంఘం గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు రాసూరి రాజేష్, హరి పాల్గొన్నారు.