హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 18: కాకతీయ విశ్వవిద్యాలయానికి మరో కీర్తి కిరీటం దక్కింది. ‘2023 యూ ఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్’లో కాకతీయ వర్సిటీ 600వ ర్యాంకు సాధించింది. దేశంలో ని విశ్వవిద్యాలయాల్లో 29వ స్థానం లో, తెలంగాణలోని విశ్వవిద్యాలయా ల్లో మొదటి స్థానంలో, తెలుగు రాష్ర్టాల పరంగా 2వ స్థానంలో నిలిచి సత్తాచాటింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ యూఐ గ్రీన్ మెట్రిక్ ఛైర్పర్సన్ నుంచి మెయిల్లో అందినట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ స్థాయి 600వ అత్యంత స్థిరమైన విశ్వవిద్యాలయంగా ర్యాంక్ పొందిందని, పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుతమైన క్యాంపస్ నిర్వహణపై దృష్టి సారించిన ప్రయత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రమేశ్ అభినందించారు.