Jagtial | జగిత్యాల రూరల్, జూన్ 17: అవును.. ఈ కోడి యజమాని ఏది చెప్తే అదే వింటున్నది. ముందుకు వెళ్లమంటే ముందుకు.. వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడమల మల్లారెడ్డి తన భూమిలో వ్యవసాయం చేయడంతోపాటు కోళ్లు, చేపలు పెంచుతుంటాడు. అందులో భాగంగానే.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి కడక్‌నాథ్ జాతికి చెందిన కొన్ని కోడి పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్నాడు.
ఒక్కో కోడి పిల్లను రూ.150కి కొనుగోలు చేశాడు. అందులో ఇప్పుడు ఆరు నెలల వయసున్న ఓ నల్ల కోడి మల్లారెడ్డి చెప్పినట్టు వింటున్నది. వెనక్కి, ముందుకు వెళ్లడం, యజమానిపై కూర్చోవడం వంటి పనులు చేస్తున్నది. ఈ కోడి అంటే తనకు చాలా ఇష్టమని, తాను చెప్పినట్టు వింటున్నదని మల్లారెడ్డి చెప్తున్నాడు. ఈ కోడి చేష్టలను చూసినవారంతా ఆశ్చర్యచకితులవుతున్నారు.