Brahma Devara Cheruvu | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో అక్రమార్కులకు ఇదే అవకాశంగా తెగబడుతున్నారు. చెరువు శిఖాల్లో మట్టిని పూడ్చి మడులు కడుతున్నారు. చెరువుల్లోనే బోర్లు వేసి సాగు చేసుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60 ఎకరాల వరకు కబ్జా చేశారు. ఊరందరనీ సాదిన చెరువు ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా కొనసాగుతున్నది. బ్రహ్మదేవర చెరువు లెక్క బ్రహ్మదేవుడికే తెలుసునని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో కాకతీయులు నిర్మించిన బ్రహ్మదేవర చెరువు మండలంలోనే అతిపెద్దది. చెరువు విస్తీర్ణం 191ఎకరాలు. వెయ్యి ఎకరాలకుపైగా ఆయకట్టు. 24 గ్రామాలకు తాగునీరు అందించే కల్పతరువు. నిరుడు సెప్టెంబర్‌లో అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్ల లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు నాటి ఆర్థికమంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్టు పూర్తయితే మూడు మండలాల్లోని 11 గ్రామాల్లో సుమారు 11 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందించే రిజర్వాయర్‌ను కట్టవైపు మినహా మూడు వైపుల నుంచి శిఖాన్ని కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు.
చెరువు శిఖం భూమి అంటే.. చెరువు నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం. ఎవరికైనా ప్రభుత్వం పట్టా ఇచ్చి ఉంటే ఆ భూమి తేలినప్పుడే సాగుచేసుకోవాలి. ఆ ప్రాంతంలో చెట్లు నరకడం, మట్టి తవ్వడం వంటివి చేయకూడదు. కొందరు అక్రమార్కులు చెరువు మట్టిని ట్రాక్టర్లతో తరలించి శిఖం భూమిని ఆక్రమించారు. మడులుగా అచ్చుకట్టి సాగుచేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో చెర్వుఅన్నారం, ఇతర గ్రామాల రైతులు ఒక్కొక్కరు మూడెకరాల నుంచి పదెకరాల వరకు ఆక్రమించుకున్నారు.
చెరువును పూడ్చుతూ సాగు చేసుకోవడమేకాకుండా చెరువులోనే ఇటీవల బోర్లు కూడా వేశారు. ఇప్పటివరకు 60 ఎకరాల చెరువు శిఖాన్ని కలిపేసుకున్నారు. జాతీయ రహదారి సమీపంలో కనుక ఎకరం కనీసం రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. ఈ లెక్కన భూమి విలువ అక్షరాల రూ.30 కోట్లకు పైమాటే. పదేండ్లపాటు కాలమై చెరువులో నీళ్లు నిండుగా ఉన్నాయి. నిరుడు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. ఇదే అదనుగా ఇంకో అడుగు ముందుకేసి చెరువు అలుగును కూడా కబ్జా చేశారు.
అలుగువరకు మట్టిని పూడ్చి మడులు అచ్చుకట్టారు. పడమటి వైపు అలుగు భూమి పూర్తిగా కబ్జాకు గురైంది. ఈ ఏడాది వేసవిలో గుట్టను దాపుగా చేసుకొని చెరువు మట్టిని తరలించి పెద్దమొత్తంలో ఆక్రమణకు తెగబడ్డారు. ఫలితంగా రిజర్వాయర్‌లో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది తప్ప పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
అయిటిపాములలో రికార్డుల ప్రకారం.. బ్రహ్మదేవర చెరువు కాకుండా 86 ఎకరాల్లో మెదుగుల చెరువు, 12.31 ఎకరాల్లో చౌడమ్మ కుంట,11.39 ఎకరాల్లో కుతురోని కుంట, రసూల్‌గూడెంలో 10.24 ఎకరాల్లో ఊరకుంట, 6 ఎకరాల్లో తీగలమ్మ చెరువు (కుమ్మరికుంట), 5 ఎకరాల్లో కానాలకుంట, అన్నారం రోడ్డులో 2.38 ఎకరాల్లో నేలమర్రికుంట, మరో 3-4 కుంటలు ఉన్నాయి. కుమ్మరికుంట పూర్తి కబ్జాకు గురికాగా, మిగతా కుంటలు అధికశాతం ఆక్రమణదారుల చేతుల్లో చిక్కాయి.
అయిటిపాముల చెరువు, కుంటల ఆక్రమణల గురించి డీఈఈ భూషణాచారిని వివరణ కోరగా.. రిజర్వాయర్ ఆక్రమణ గురించి కొందరు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులతో కలిసి వచ్చిన తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.