Konda Surekha | మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిభ్రమించి, పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్లుగా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఆమె మాటలు చట్టవిరుద్ధమని తెలిపారు. ఇదే అమెరికాలో అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంటు సభ్యత్వమే పోగొట్టుకోవాల్సింది వచ్చిందని కేఏ పాల్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోలిస్తే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ఆమెకు నోటీసులు ఇచ్చి ఎందుకు అరెస్టు చేయలేదని డీజీపీని ప్రశ్నించారు. ఇప్పుడు సారీ చెబితే.. హత్య చేసి సారీ చెప్పినట్లుగా ఉందని విమర్శించారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా? అని అన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.
కొండా సురేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డిని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం 72 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 72 గంటల్లో రాజీనామా చేయకపోతే కొండా సురేఖపై కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. రాహుల్ గాంధీపై ఏఏ సెక్షన్ల ప్రకారమైతే తన పదవిని పోగొట్టుకున్నారో వాటిని మించిన కేసు కొండా సురేఖపై నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కొండా సురేఖ రాజీనామా చేసినా.. లేదా ఆమెను పదవి నుంచి తొలగించినా తనకు ఒక కేసు మిగులుతుందని చెప్పారు. హైడ్రా విషయంలో వ్యతిరేకత పెరుగుతుందని ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొండా సురేఖతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.