హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నరహత్య కంటే ఘోరమైనవిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభివర్ణించారు. తన మాటలను వెనక్కి తీసుకున్నానంటే సరిపోదని, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాలని, అంతేకాకుండా మంత్రి పదవికి కూడా ఆమె రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను పెట్టిన గడువు ముగిసినా సురేఖ రాజీనామా చేయనందున 14న హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు. సురేఖపై డీజీపీ కేసు నమోదుచేయాలని, హైకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. రాష్టంలో పరిస్థితి యథా రాజా తథా మంత్రి అన్నట్టుగా ఉన్నదని, ముఖ్యమంత్రి మొదలు మంత్రులు అందరూ బూతు పురాణమే అందుకుంటున్నారని ఆక్షేపించారు.
హైదరాబాద్ అమీర్‌పేటలోని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరహత్య అంటే ఒకరి ప్రాణమే పోతుందని, కానీ, సురేఖ వ్యాఖ్యలు ఒక్క సినీరంగానికి సంబంధించినవి కావని, కోట్ల మంది భారత ప్రజల మనోభావాలకు సంబంధించినవని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను మర్చిపోవాలని టీపీసీసీ చీఫ్ అంటున్నారని, అడ్డగోలుగా దూషించి మర్చిపోవాలంటే ఎలా? అని ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీలో దానం నాగేందర్ బూతులు మాట్లాడారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టులో కేసు వేశానని గుర్తుచేశారు. 1975లో ఇందిరాగాంధీని, ఇటీవల రాహుల్‌గాంధీని కూడా డిస్క్వాలిఫై చేశారని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ అతీలుకారని పేర్కొన్నారు. ఈ దేశంలో బాగుపడాలంటే పొలిటికల్ కరెప్షన్ ఉండకూడదని సూచించారు.