హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికయ్యా. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన. బీఆర్ఎస్ తరపున గెలిచిన నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒప్పుకోదు. అలా కొనసాగడం చట్ట ప్రకారం నేరం. అనైతికం. కాబట్టి, బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసిన’ అని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు స్పష్టంచేశారు. తాను చట్టాన్ని గౌరవించే మనిషినని చెప్పారు. తనపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు ‘సభ్యత్వం రద్దు చేయాలి’ అని కోరకపోయినా మరో పార్టీలో చేరిన తరువాత కొనసాగడం అనైతికం అనిపించిందని, అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని వివరించారు. రాజీనామా అనంతరం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాజ్యసభకు పంపిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఇవ్వాళ లేను. కాంగ్రెస్‌లో చేరిన. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరతా.. కొనసాగుతా.. అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒప్పుకోదు. అలా కొనసాగడం చట్ట ప్రకారం నేరం. అందుకే రాజీనామా చేసిన.
ఫిర్యాదు చేశారా? చేయలేదా? అనేది నాకు ముఖ్యం కాదు. నన్ను పార్లమెంట్‌కు పంపిన పార్టీలో ఇప్పుడు లేను. దట్స్ ఆల్. అది నాకు ముఖ్యం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తున్నది? ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లొద్దని చెప్పిందా ? లేదా? అది ముఖ్యం నాకు. లీగల్లీ, మోరల్లీ (చట్టపరంగా… నైతికంగా) నా మీద ఎవరో ఫిర్యాదు చేయాలె.. ఆ తరువాత కోర్టుకు వెళ్లాలె.. అక్కడ కొట్లాడాలె…ఇవన్నీ కాదు. నిన్న (బుధవారం) కాంగ్రెస్‌లో చేరిన. ఇవ్వాళ రాజ్యసభ చైర్మన్‌ను కలిసిన రాజీనామా చేసిన.
రెన్యువల్ ఇస్తరా? ఇయ్యరా? ఇస్తే ఏమొస్తది. రాకపోతే ఏంపోతది? ఇది కాదు నాకు ముఖ్యం. చెప్పిన కదా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మారడం తప్పు. ’రాజీనామా చేయ్.. రాజీనామా చెయ్’ అని అందరూ అంటున్నా.. ‘నేను అందులోనే ఉంటాను’ అంటే చట్టం ఒప్పుకుంటుందా? అందుకే నా రాజీనామా. ఇక రెన్యువల్ చేస్తదో… చేయదో పార్టీ తేల్చుకుంటది. ఐయాం నాట్ సపోస్ టు సే వాట్ మై పార్టీ విల్ డూ ఫర్ మీ. బీ కాస్ యూ ఆర్ నాట్ పార్టీ.
అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ చట్టాలను చేస్తాయి. పార్లమెంట్ చేసే చట్టాలను దేశమంతా ఒకేరీతిగా అమలు చేయాలని చట్టం చెప్తున్నది. నా రాజీనామా గురించి మీరు అడిగారు చెప్పిన. చట్టం ఏం చెప్తున్నది? పార్టీ ఏం చెప్తున్నది? చివరికి ఏది నిలబడుతుంది? అన్నది వాళ్లే తేల్చుకోవాలి నేను కాదు.
ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరడం సరికాదని భావించి, ఇంకా సమయం ఉన్నా తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన కే కేశవరావును రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి సూచించారు. ఫిర్యాదు విషయంలో ఆలోచిస్తున్న సమయంలో రాజీనామా చేసి తాను చట్టానికి బద్ధుడనని కేశవరావు నిరూపించుకున్నారని చెప్పారు. ఇదొక మంచి సంప్రదాయమని కొనియాడారు. పార్టీ మారితే సభ్యత్వం రద్దు అవుతుందని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చాలా స్పష్టంగా పేర్కొన్నదని గుర్తుచేశారు. ఫిర్యాదు అందిన తరువాత ఆ దిశగా సభాపతి నిర్ణయం తీసుకోవాలని చట్టం చెప్తున్నదని, అలా కాని పక్షంలో రాజ్యాంగంలోని 142 సెక్షన్ కింద సుప్రీంకోర్టు ఆ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చని తీర్పులు ఉన్నాయని వివరించారు.
బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కే కేశవరావు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తెల్లారే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం దాదాపు రెండేండ్లు ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. ఆయన ఇప్పటివరకు మూడుసార్లు ఎంపీగా పనిచేశారు.