హనుమకొండ, ఏప్రిల్ 18 : శాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు నడుంబిగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ పిలుపునిచ్చారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ వివాదమైనా ఒక వ్యక్తి, మరో వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితిలో కమ్యూనిటీకి చెందిన పెద్దవారు నచ్చచెబితే వివాదాలు పరిషారమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమని చెప్పారు. దేశంలో మొదటిసారిగా కేరళలో ఈ విధానం విజయవంతమైందని, కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిషరించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నట్టు ప్రశంసించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, సీహెచ్ రమేశ్‌బాబు పాల్గొన్నారు.