హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం(ఐఏఎంసీ)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవస్థాపక ట్రస్టీ పదవికి జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చేశారు. నూతన శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఐఏఎంసీ 2019లో ఏర్పడినప్పుడు శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ట్రస్టీలుగా జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, నాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి నియమితులయ్యారు.
వ్యక్తిగత కారణాల వల్ల జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చేసినట్టు నిర్ధారించారు. ఆ పదవిలో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. తమిళనాడు, కేరళ పెద్దలు హైదరాబాద్ ఐఏఎంసీ పురోగతిని అడ్డుకోబోయారని విమర్శలున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా హైదరాబాద్‌లో ఐఏఎంసీని ఏర్పాటుచేయాలని 2019లో సంకల్పించారు. ఆయన ప్రతిపాదనకు నాటి కేసీఆర్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. కేసీఆర్, నాటి మంత్రి కేటీఆర్ చొరవతో ఐఏఎంసీకి అత్యంత ఖరీదైన భూమి ఇవ్వడమే కాక తాతాలిక ఆఫీస్ ఏర్పాటుచేసింది.