హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ సోమవారం ప్రమాణం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సతీష్‌చంద్రశర్మ చేత ప్రమాణం చేయించారు. వేదికపై వారిద్దరితోపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసీనులయ్యారు. జస్టిస్ ఎస్సీ శర్మ ఇంగ్లిష్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎం.. జస్టిస్ శర్మకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ నెల 6న సీజే నియామకానికి జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి చదివారు. ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. అనంతరం నేరుగా హైకోర్టుకు వెళ్లిన సీజే, న్యాయమూర్తులు, న్యాయాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. సీజే రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 11కు చేరింది. తాజాగా జస్టిస్ టీ అమర్నాథ్గౌడ్ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయనకు వీడోలు చెబితే న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 10కి తగ్గుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం భూపాల్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అమర్నాథ్గౌడ్, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్‌రావు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.