హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీఆర్ఈఏటీ) చైర్మన్‌గా జస్టిస్ అనుగు సంతోష్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, సభ్యులు జస్టిస్ సంతోష్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని జోగన్‌పల్లి జస్టిస్ సంతోష్‌రెడ్డి స్వగ్రామం.
ఆయన తండ్రి దివంగత అనుగు నారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే.జగిత్యాలలో డిగ్రీ, అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో లా చదివిన జస్టిస్ సంతోష్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పూర్తిచేశారు. 1985లో అడ్వకేట్‌గా నమోదై కరీంనగర్ జిల్లాలో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన న్యాయ సేవలను ప్రభుత్వం గుర్తించి టీఆర్ఈఏటీ చైర్మన్‌గా నియమించింది.