హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తిచేసింది. కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ పినాకీచంద్రఘోష్ ప్రాజెక్టుపై తుది నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించారు. దాదాపు 650 పేజీలతో రూపొందించిన నివేదికను మూడు సంపుటాలుగా మార్చి సీల్డ్ కవర్లో బీఆర్కేభవన్లో ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేశారు.
అనంతరం ఆ నివేదికను ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుకు అందజేశారు. ఈ సమాచారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైతం అందించారు. ఈ నివేదికను తొలుత క్యాబినెట్లో పెట్టి చర్చించే అవకాశముందని, ఆ తరువాత న్యాయ సలహా తీసుకొని అసెంబ్లీకి నివేదించనున్నట్టు సమాచారం. ఆ తరువాతే తదుపరి చర్యలను చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్‌లోని 20, 21వ పిల్లర్లు 2023 అక్టోబర్21న కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే.
అదేవిధంగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో పలుచోట్ల సీపేజీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు బరాజ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌తోపాటు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చి 13న కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటుచేసింది. వంద రోజుల్లో నివేదికను సమర్పించాలని మార్గదర్శకాలను జారీచేసింది. కానీ ఏడుసార్లు గడువు పొడిగించింది. కమిషన్ తన విచారణను మే చివరి వారం నుంచి ప్రారంభించింది.
జస్టిస్ ఘోష్ కమిషన్‌కు నోడల్ ఆఫీసర్‌గా ఇరిగేషన్‌శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను, సాంకేతిక అంశాలపై సహాయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధంలేని నా గర్‌కర్నూల్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి, జాయిం ట్ సెక్రటరీ(టెక్నికల్) శ్రీనివాస్‌తోపాటు, మొత్తంగా ముగ్గురు ఈఈలు, ఆరుగురు డీఈఈలు, 12 మంది ఏఈఈలను ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కమిషన్ ఎంక్వయిరీని ప్రారంభించింది. తొలుత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను జస్టిస్ ఘోష్ క్షేత్రస్థాయిలో సందర్శించారు.
ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ప్రాజెక్టుపై ప్లానింగ్, డిజైన్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టుల అప్పగింతపై ఫిర్యాదు లు, సలహాలు స్వీకరించేందుకు కమిషన్ కార్యాలయంలో వేర్వేరుగా బాక్సులు ఏర్పాటు చే యించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను, ఫిర్యాదులను స్వీకరించారు. 58 మంది కమిషన్ ఎదుట అఫిడవిట్లు దాఖలు చేశారు. అనంతరం 2024 ఆగస్టు 21 నుంచి కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభించింది. ఇరిగేషన్‌శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌తో పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించారు. కాళేశ్వ రం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్, ఓఅండ్ఎం తదితర విభాగాలకు చెంది న ఇంజినీర్లు, బరాజ్‌ల నిర్మాణ ఏజెన్సీలు, ప్రాజెక్టు ఆమోదం నుంచి నిర్మాణం, కుంగుబాటునకు గురయ్యే వరకూ విధులు నిర్వర్తించిన ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శులను, ఆర్థిక కార్యదర్శులను విచారించారు.
కాగ్ అధికారుల నుంచి వివరాలను సేకరించారు. చిట్టచివరగా రాజకీయ ప్రముఖులతోపాటు 115 మందిని విచారించారు. బరాజ్‌లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సమర్పించిన తుదినివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ నివేదికలను సైతం కమిషన్ అధ్యయనం చేసింది. అన్ని అంశాలను క్రోడీకరించి 650 పేజీల నివేదికను సమర్పించింది.
కాళేశ్వరం కమిషన్ సమర్పించిన నివేదికను సీఎం రేవంత్‌కు శుక్రవారం మధ్యాహ్నం అందజేయనున్నారని సమాచారం. విజిలెన్స్ రిపోర్టు ఇప్పటికే 39 మంది అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. రిపోర్టును తొలుత క్యాబినెట్లో చర్చించి, ఆమోదించిన తరువాత అసెంబ్లీ ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ తరువాతే తదుపరి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని సమాచారం.
కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 11న స్వయంగా హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ 50 నిమిషాలపాటు ముఖాముఖిగా విచారించారు. ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ కూలంకషంగా సమాధానాలు ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ ఆవశ్యకత, తీసుకున్న నిర్ణయాలను, అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలపై కమిషన్ ఆరా తీసినట్టు సమాచారం. ఆయా అంశాలపై కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ కూలంకషంగా వివరించారు. అంతకుముందు జూన్ 9న మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం బహిరంగ విచారణకు హాజరయ్యారు. దాదాపు 40నిమిషాల పాటు జస్టిస్ ఘోష్ 20 ప్రశ్నలను సంధించగా, వాటన్నింటికీ హరీశ్‌రావు బదులిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను సైతం కమిషన్ విచారించింది.