హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, నూతన విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై దర్యాప్తునకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ (రిటైర్డ్) ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తాను దర్యాప్తు చేసిన అంశాలలోని న్యాయాన్యాయాలను జస్టిస్ నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని, ఆయన స్థానంలో కొత్త చైర్మన్‌ను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారంలోపు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈఆర్సీ ఆ మోదించిన అంశాలపై ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించడం చట్టవిరుద్ధమని, విచారణ సమయంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారని, పక్షపాతంగా వ్యవహరించారని, విచారణ పూర్తికాక ముందే అనేక అంశాలను బహిర్గతం చేశారని ఆరోపిస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖ లు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పార్దీవాలా, మనోజ్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ లూత్రా, కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
భోజన విరామానికి ముందు జరిగిన వాదనల అనంతరం ధర్మాస నం.. ‘న్యాయం జరగడమే కాదు.. న్యాయం జరిగినట్టు కనిపించాలి కూడా విచారణ కమిషన్‌గా చైర్మన్‌గా ఉన్న ఆయన (జస్టిస్ నరసింహారెడ్డి) తాను కనుగొన్న అంశాలలోని న్యాయాన్యాయాలను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందువల్ల దర్యాప్తు కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించే అవకాశం మీకు (తెలంగాణ ప్రభుత్వానికి) కల్పిస్తున్నాం. ఆయన స్థానంలో మరొక జడ్జిని నియమించండి ’ అని ఆదేశించింది.
అనంతరం భోజన విరామం తర్వాత విచారణ కొనసాగిస్తామని తెలిపింది. ఈ సమయంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్తు విచారణ సంఘం బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఓ న్యాయవాది ద్వారా జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖను పంపించారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సయమమివ్వగా, సోమవారం లోపు నూతన చైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ జస్టిస్ నర్సింహారెడ్డి.. కేసీఆర్ సహా 28 మందికి లేఖలు రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూలై 30 వరకు గడువు కావాలని కేసీఆర్ కోరారు. అయితే జూన్ 11న మీడియా సమావేశం నిర్వహించిన జస్టిస్ నర్సింహారెడ్డి వివరాలను వెల్లడించారు. జూన్ 15న కేసీఆర్ 12 పేజీల లేఖను విచారణ సంఘానికి పంపించారు. విద్యుత్తు కమిషన్ చట్టబద్ధం కాదని, నర్సింహారెడ్డి ఆ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం విచారణకు హాజరవ్వాలని కేసీఆర్‌కు విచారణ సంఘం మరో లేఖను పంపించింది. దీంతో కేసీఆర్ జూన్ 24న హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ఈ నెల ఒకటిన హైకోర్టు కొట్టివేసింది. ఆ నిర్ణయాన్ని సవాలుచేస్తూ 10న సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయగా, మంగళవారం సుప్రీంకోర్టు విచారించి, నర్సింహారెడ్డిని బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది.
దర్యాప్తు చేపట్టిన జస్టిస్ నర్సింహారెడ్డి.. కేసీఆర్‌పై తప్పులు ఆపాదించబోయి.. చివరికి తానే తప్పుకునే స్థితిని తెచ్చుకున్నారు. విచారణ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ సర్కారు అనేక తప్పులు చేసిందని ముందే ప్రకటించి ఉండాల్సింది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తప్పిదమే ఆయన పదవికి ఎసరు తెచ్చి పెట్టింది. రిపోర్టర్లు కమిషన్ మీద ఏవేవో ఊహించుకుని వార్తలు ప్రచురించేవారని పేర్కొన్నారు. దీనికి ముగింపు పలకడానికే విచారణ పురోగతి వివరించేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించినట్టు లేఖలో పేర్కొన్నారు. ‘జడ్జి అయి నా.. రిటైర్డ్ జడ్జి అయినా పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. ఇలా జరిగినప్పుడు విచారణ సంఘం తమ ప్రా ముఖ్యతను కోల్పోయినట్టే. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే దిశలో తాను విచారణ సంఘం కమిషన్‌గా కొనసాగాలని భావించడంలేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తీరును ఏజీ ఎప్పటికిప్పుడు సీఎంకు సమాచారమిచ్చారు. కమిషన్ చైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా వివరించారు. దీంతో రేవంత్ సూచన మేరకే ఏజీ సుప్రీం కోర్టును సోమవారం వరకు గడువు కోరినట్టు తెలిసింది.