హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ జీ అనుపమ చక్రవర్తికి సోమవారం ఘనంగా వీడోలు పలికారు. వీరిలో జస్టిస్ లక్ష్మణ్ రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అనుపమ పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన మొదటి కోర్టు హాలులో సోమవారం వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించి, వారి సేవలను కొనియాడారు.
అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్వర్యంలో వారిద్దరినీ సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పీ నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి. అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్, పీపీ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టులోని మొత్తం 42 జడ్జి పోస్టులకు గాను ప్రస్తుతం సీజేతో కలిపి 30 మంది ఉన్నారు. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ అనుపమ బదిలీతో ఈ సంఖ్య 28కి తగ్గుతుంది. వీరిలో జస్టిస్ చిల్లకూరు సుమలత, జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.