హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో జిల్లాకో న్యాయం నడుస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు)ను నియమించింది. అదే ఏడాది జూలై/ఆగస్టు నెలల్లో వారు విధుల్లో చేరారు. నిరుడు ఆగస్టు నాటికి వారి ప్రొబేషనరీ కాలం ముగియడంతో ప్రభుత్వం సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించి పోలీస్ వెరిఫికేషన్ కూడా పూర్తిచేసింది. క్రమబద్ధీకరణ ఉత్తర్వుల జారీయే మిగిలి ఉంది.
27 మందికే ఎందుకు?
మహబూబ్‌నగర్ జిల్లా డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న 27 మంది నర్సింగ్ ఆఫీసర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. వీరి క్రమబద్ధీకరణపై గత అక్టోబర్‌లో డీఎంఈ కార్యాలయం నుంచి డీపీహెచ్ కార్యాలయానికి ప్రతిపాదనలు అందగా, వారం క్రితం సర్వీస్‌ను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగతా 2,391 మంది అభ్యర్థులకు పోలీస్ వెరిఫికేషన్ పూర్తయి అక్కడితో ఆగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యారోగ్యశాఖలో బదిలీల మాటున పెద్ద ఎత్తున దందా నడుస్తున్నదన్న ఆరోపణలకు తోడు, డీపీహెచ్ కార్యాలయంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతున్నదంటూ ఆడియో సైతం వైరల్ అయింది. 2021 బ్యాచ్ నర్సుల క్రమబద్ధీకరణను కొందరు దళారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది.