హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ లికర్ ఉత్పత్తికి ఎలాంటి నీటి కొరతనూ రానివ్వబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బీరు తయారీకి ఎలాంటి నీటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటామని, అవసరమైతే వాటికోసం శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సెస్ వల్ల మద్యం తాగే వారిపై మాత్రమే భారం పడుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ సిటీని అప్‌గ్రేడ్ చేశామని, అందుకు అనుగుణంగానే బార్ లైసెన్స్‌లు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాలలో ఉన్న విధంగానే బార్లకు పర్మిషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. మద్యం తాగడం తగ్గాలని గతంలో రేట్లు పెంచాం… అయినా పెద్దగా మార్పేమీ లేదన్నారు. ప్రస్తుతం రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని, తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల కోట్ల ఆదాయం మాత్రమే పెరిగిందని చెప్పారు.