Telangana | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల కేటాయింపు కోసం జారీచేసిన జీవో-317తో నష్టపోయిన వారికి, న్యాయం చేసేందుకు అవకాశం కల్పించిన పరస్పర బదిలీల ప్రక్రియ అక్రమాలకు అడ్డాగా మారుతున్నది. ముఖ్యంగా పలువురు టీచర్ల మధ్య పరస్పర బదిలీల కోసం రూ.15-20 లక్షల వరకు చెల్లించేందుకు బేరసారాలు సాగినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రిక్రూట్ అయినవారు, జూనియర్ టీచర్లు త్వరలో రిటైర్ కానున్న సీనియర్ టీచర్లతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. జూనియర్లు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఏడాదిలోపు పదవీ విరమణ పొందనున్నవారు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా బదిలీ అయ్యేందుకు రెడీ అంటున్నారు. దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. గతంలో ఒకసారి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించగా, అప్పుడు ఇదే తరహా దందా జరిగింది. మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియగా, ఎన్ని దరఖాస్తులొచ్చాయన్న విషయాన్ని జీఏడీ అధికారులు వెల్లడించలేదు.
జీవో-317లో ఉద్యోగుల కేటాయింపునకు సీనియార్టీని ప్రాతిపదికన తీసుకున్నారు. దీంతో సీనియర్లు పాత జిల్లా కేంద్రాల్లోనే ఉండగా, జూనియర్లు మారుమూల ప్రాంతాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారికి న్యాయం చేసేందుకు నవంబర్ 29న ప్రభుత్వం మూడు జీవోలను జారీచేసింది. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఇందులోభాగంగా ‘ఇంటర్ లోకల్ క్యాడర్’లో బదిలీలకు అవకాశం కల్పించారు. అంటే ఒకే విభాగంలోకి ఒకే క్యాటగిరిలోని ఇద్దరు ఉద్యోగులు పరస్పరం బదిలీ కోరవచ్చు. అంటే ఎస్ఏ గణితం సబ్జెక్టు (ఇంగ్లిష్ మీడియం) టీచర్.. అదే పోస్టు, అదే మీడియం గల మరో టీచర్.. పరస్పర బదిలీకి అర్హులు. పరస్పర బదిలీ అయినవారు పాత సీనియార్టీని వదులుకోవాల్సి ఉంటుంది. కొత్త క్యాడర్లో చివరి ర్యాంకులో చేరాల్సి ఉంటుంది. సర్వీసు నష్టపోతామని తెలిసినా డబ్బుల కోసం పలువురు ఇందుకు అంగీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.
మ్యూచువల్ బదిలీలతో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ వంటి జిల్లాల్లో భవిష్యత్‌లో కొత్త రిక్రూట్మెంట్ కష్టంగానే కనిపిస్తున్నది. ఈ జిల్లాల్లోని సీనియర్లు మరో జిల్లాకు బదిలీకానుండగా, ఇతర జిల్లాల నుంచి జూనియర్లు ఈ జిల్లాలకు రానున్నారు. దీంతో ఆ మేరకు డీఎస్సీ రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య తగ్గిపోనున్నది. అయితే, పరస్పర బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అంగీకారం తీసుకుంటారు. ఆ తర్వాత బదిలీలు చేపట్టే అవకాశం ఉన్నది.
మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్‌లో నివాసముండే ఒక టీచర్ మరో నాలుగు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఈ టీచర్ సంగారెడ్డి జిల్లాలో పనిచేసే మరో జూనియర్ టీచర్‌కు పరస్పర బదిలీ అయ్యేందుకు విల్లింగ్ ఇచ్చారు. ఈ బదిలీ కోసం జూనియర్ టీచర్ నుంచి సీనియర్ టీచర్ రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో మాదిరిగా పదవీ విరమణ పొందిన వెంటనే ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో నాలుగు నెలలు కష్టపడితే రూ.20 లక్షలొస్తాయన్న ఆశతో సీనియర్ టీచర్ బదిలీకి సుముఖత వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ఒక టీచర్ రంగారెడ్డి జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నించగా, సహకరించేందుకు మరో టీచర్ ముందుకొచ్చారు. ఇందుకు రూ.15 లక్షలకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ముందు బాండ్ రాసుకుని కొంత అడ్వాన్స్‌గా ఇచ్చారని, మిగతా మొత్తానికి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని తెలుస్తున్నది.
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పనిచేసే ఒక టీచర్ నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు బదిలీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక టీచర్‌కు ఫోన్ చేయగా, రూ.20 లక్షలు ఇస్తానంటే ఓకే అని చెప్పడంతో బిత్తరపోవడం సదరు టీచర్ వంతయ్యింది.
వికారాబాద్ జిల్లాకు చెందిన ఎస్జీటీ ఒకరు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో చేరిన వారికి పాఠశాలకు రానుపోను కార్ షేరింగ్ సమకూరుస్తామంటూ కబురుపెట్టారు.
జనగామ జిల్లాకు చెందిన ఎస్ఏ హిందీ టీచర్ ఒకరు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు పరస్పర బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ టీచర్ తాను బ్రోకర్లకు తాను కమీషన్ ఇచ్చుకోలేనంటూ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం పరిస్థితిని కండ్లకు కడుతున్నది.