Sai Kumar | దండేపల్లి/లక్షెట్టిపేట, మే 5: ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట వద్ద చోటుచేసుకున్నది. దండేపల్లి ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెంకు చెందిన ఓగేటి సత్తయ్య-లక్ష్మి దంపతుల కొడుకు సాయికుమార్ (24) నిర్మల్ విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. బంధువుల అమ్మాయిని నాలుగేండ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 11న పెండ్లి జరిపించాలని ఇరు కుటుంబాల వారు నిశ్చయించగా.. లగ్గం పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో పెండ్లి కార్డులు పంచేందుకు, సెలవు పెట్టేందుకని అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు మహేశ్‌తో కలిసి గురువారం బైక్‌పై నిర్మల్ వెళ్లాడు. అదే రోజు రాత్రి తిరిగి వస్తుండగా.. మేదరిపేట వద్ద లక్షెట్టిపేట వైపు వెళ్తున్న హార్వెస్టర్ ముందు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సాయి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సాయి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మహేశ్‌కు తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్ దవాఖానకు తరలించారు. సాయికుమార్ మృతదేహాన్ని లక్షెట్టిపేట దవాఖానకు తరలించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.