హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పీరియడ్‌కు రూ. 300 చొప్పున పారితోషికాన్ని ఇస్తుండగా, తాజాగా పీరియడ్‌కు రూ. 390కి పెంచూతూ జీవో విడుదల చేసింది. వీరు నెలకు 72 గంటల పాటు పనిచేసేలా, పారితోషికం రూ. 28,080 మించరాదని సీలింగ్ విధించారు. ఈ మేరకు గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ జీవో – 1105ని విడుదల చేశారు. దీంతో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది గెస్ట్ లెక్చరర్లకు ప్రయోజనకం కలగనుంది.
వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 మాత్రమే ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంలో ఆలోచించి, 2017లో పీరియడ్‌కు రూ. 300కు పెంచింది. తాజా పీఆర్సీ ప్రకారం.. రూ. 390కి పెంచింది. వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 చొప్పున నెలకు రూ. 10, 800 మాత్రమే ఉండగా, తెలంగాణ సర్కారు సుమారు రెండు రెట్లు పెంచింది. పీరియడ్‌కు రూ. 300 ఉన్నప్పుడు నెలకు రూ. 21,600 అందగా, తాజా పెంపుతో రూ. 28,080కి చేరింది.
ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసొసియేషన్ (2151) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, అసొసియేట్ అధ్యక్షుడు కోడి మహేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎం. బాబురావు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.