Junior Doctors | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో పలు రోగులకు ఇబ్బందులు తప్పలేదు. సోమవారం గాంధీ, ఉస్మానియా, కాకతీయతోపాటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు తమ తమ కాలేజీల ముందు భైఠాయించి నిరసన తెలిపారు.
ఈ నేపథ్యం లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మి నిస్టర్స్ క్వార్టర్స్‌లో చర్చలు జరిపారు. జూడా లు తమ ఎనిమిది డిమాండ్లను మంత్రి ముం దుంచారు. చర్చల అనంతరం జూడా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. మంత్రి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ైస్టెపెండ్ చెల్లింపునకు గ్రీన్‌చానల్‌పై మరోమారు చర్చించి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల నిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణానికి ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపినట్టు చెప్పారని పేర్కొన్నారు. వైద్యుల భద్రతకు హామీ ఇచ్చారని, కొత్త మెడికల్ కాలేజీలకు బస్ సౌకర్యంపై డీఎంఈతో చర్చించాలని సూచించారని తెలిపారు. అయితే, పూర్తిస్థాయిలో అన్ని డిమాండ్లపై హామీలు రాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించా రు. అనంతరం జూడా ప్రతినిధులు కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వెళ్లారు. డీఎంఈ వాణితో సమావేశమయ్యారు.
కొన్ని హామీల అమలుకు ప్రభుత్వం సిద్ధం
జూడాల డిమాండ్లలో కొన్నింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని డీ ఎంఈ పేర్కొన్నారు. మిగతావాటిపై స్పష్టత కోసం రెండుమూడు రోజుల సమయం కావాలని కోరారు.