హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఒక ప్రకటనలో తెలిపారు. ైస్టెపెండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి చేపట్టే ఆందోళనా కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
1 నుంచి ‘ఆపరేషన్ ముస్కాన్’: చారుసిన్హా
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ను నిర్వహించనున్నట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, వెట్టిచాకిరి నుంచి బాల కార్మికులకు విముక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చారుసిన్హా వెల్లడించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లతో సమన్వయం చేసుకుంటూ బాల కార్మికులకు రక్షణ, పునరావాసం కల్పిస్తామని తెలిపారు.