హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 2 నుంచి జరుగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతానికి ప్రభుత్వ కాలేజీల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేస్తారు. ఆ తరువాత ప్రైవేట్ కాలేజీలకు కూడా విస్తరిస్తారు. ఈ విధానంలో ఒక కాలేజీలో చదివే విద్యార్థులకు సొంత కాలేజీలో కాకుండా, మరో కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షకేంద్రాన్ని కేటాయిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆదివారాలు సైతం పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పు
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్పల్ప మార్పు చోటుచేసుకున్నది. మార్చి 3న హోలీ పండుగ ఉండగా, అదే రోజు సెకండియర్ విద్యార్థులకు గణితం పేపర్-2ఏ, వృక్షశాస్త్రం పేపర్-2, రాజనీతిశాస్త్రం పేపర్-2 పరీక్షలు ఉన్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో మూడో తేదీన జరగాల్సిన పరీక్షలను మార్చి 4న నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు సెక్రటరీ కృష్ణఆదిత్య మంగళవారం విడుదల చేశారు. మిగతా పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేశారు.