హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపం ఎక్కడ, ఎవరివల్ల జరిగిందో సహేతుకంగా గుర్తిస్తామని జ్యుడీషియల్ ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్, జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. విచారణలో భాగంగా బుధవారం ప్రాజెక్టు నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జస్టిస్ ఘోష్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించామని, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు పనులు చేసినట్టు వెల్లడించారని తెలిపారు. అన్ని అంశాలపై నెలాఖరులోగా అఫిడవిట్ దాఖలు చేయాలని అదేశించానని, వాటిని పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామని, లోపం ఎకడ జరిగింది? ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని తెలిపారు. కమిషన్కు ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయాలని చెబుతున్నామని, తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు కూడా ఉన్నాయని, ఆయా సంస్థలవారిని కూడా పిలిచి వివరాలు తీసుకుంటామని, నేడు కూడా విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.