హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిరుడు కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రేవంత్రెడ్డి వేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ ప్రకటించారు.
ఎంపీటీసీల డీలిమిటేషన్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విలీన గ్రామాల్లోని ఎంపీటీసీల డీలిమిటేషన్ షెడ్యూల్ను సర్కారు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలు గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది. పలు గ్రామపంచాయతీలు ఇతర మండలాలు, జిల్లాల్లో కలిశాయి. ఈ నేపథ్యంలో మండల ప్రాధేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. నేటి(మంగళవారం) నుంచి ఎంపీటీసీల డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అభ్యంతరాల స్వీకరణ, 10, 11 తేదీల్లో పరిశీలన చేసి 12న తుది జాబితా ప్రచురించనున్నట్టు తెలిపింది.