నాంపల్లి కోర్టులు, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, టాస్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురి పేర్లు ఉన్నాయంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగాలేనని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి కోర్టుకు తెలిపారు. విదేశాల్లో ఉన్న వారిని విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వరాదని వాదించారు. చార్జిషీటులో పేర్కొన్న కీలక ఆధారాలను నిందితులకు ఇవ్వలేదని వారి తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి కేసు విచారణ 14కు వాయిదా వేస్తున్నట్టు 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
మేడ్చల్, ఆగస్టు 7 : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పల్లపు సుధాకర్(45) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఫ్రీ బస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులపాలయ్యాడు. ఇల్లు గడవడం కష్టమై కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో మనస్తాపానికి లోనైన సుధాకర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.