Jubleehills By Poll | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. ‘నేనే పోటీదారు’ అంటూ నిన్నటిదాకా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఆయన వర్గం సీఎం వర్గానికి కొరకరాని కొయ్యలా ఉండేది. ఎలాగోలా తంటాలు పడి ఎమ్మెల్సీ ఆఫర్‌తో అడ్డు తొలగించుకున్నారు. ఇక తాము చెప్పిందే అధిష్ఠానానికి వేదం అనుకుని స్థానికుడికే టికెట్ అంటూ మంత్రి పొన్నంతో ప్రకటన కూడా చేయించారు. కానీ అనూహ్యంగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ రూపంలో మళ్లీ ముసలం మొదలైంది. కాకపోతే అజారుద్దీన్లా చిరుజల్లుల లెక్క కాకుండా ఈసారి తుపానులా కొనసాగుతున్నది. పొన్నం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ధీటైన కౌంటర్‌తో సమాధానమిచ్చిన అంజన్‌కుమార్ యాదవ్ తన దూకుడు మరింత పెంచారు. నియోజకవర్గంలో మంగళవారం ఏకంగా పోస్టర్లతో మరింత హల్చల్ సృష్టించారు. ఇదే అదునుగా సామాజిక కోణంలోనూ టికెట్ డిమాండ్ పెరుగుతుండటం కాంగ్రెస్‌ను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నది.
రేవంత్ పావులు.. ఆ వెనకే సవాళ్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ తరఫున తామే పట్టు కొనసాగించాలని సీఎం వర్గం ముందు నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. కానీ ఆశావహుల రూపంలో ఎప్పటికప్పుడు ఆ వర్గానికి సవాళ్లు ఎదురవుతూనే ఉండటంతో ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ పార్టీలో టికెట్ల కొట్లాట తారస్థాయికి చేరుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. కాకపోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లు కావడంతో అప్పుడు జరిగిన ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. కానీ రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కారుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఒకవంతైతే.. హైదరాబాద్ మహా నగరంలో హైడ్రా, మూసీ రూపాల్లో పేదల ఇండ్లు కూల్చడం, నయాపైసా అభివృద్ధి కూడా చేయకపోవడంతో నగరవాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ అనేక సర్వేలు చేయించుకున్నా అనుకూలత కనిపించకపోవడంతో అధిష్ఠానం అభ్యర్థి ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతున్నది. దీంతో సీఎం ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి పనుల పేరిట హడావుడి మొదలుపెట్టించారు. కనీసం గతంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు సమాచారం లేకుండానే మంత్రులు పర్యటనలు చేస్తుండటంతో అజార్ వర్గం సొంతంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇక లాభం లేదనుకొని సీఎం వర్గం చివరికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి అజార్‌ను బుజ్జగించాలని అధిష్ఠానాన్ని కోరడంతో ఆ మేరకు ఆయన అంగీకరించారు.
అడ్డులేదనుకున్న తరుణంలో
జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్‌లో టికెట్ ఆశించే వారు పలువురు ఉన్నా అజార్ రేసులో ఉన్నంత వరకు ఇతరులెవరూ పెద్దగా తెరమీదకు రాలేదు. కానీ ఎప్పుడైతే సీఎం వర్గం అజార్ అడ్డును తొలగించుకోవడమే కాకుండా ఏకపక్షంగా మంత్రి పొన్నంతో ‘స్థానికులకే టికెట్’ అని ప్రకటన చేయించింది. అప్పటికే సీఎం వర్గం తనను పరిగణలోనికి తీసుకోవడంలేదనే అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. గతంలో తాను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించానన్న అంశాన్ని కూడా సీఎం వర్గం దృష్టిలో ఉంచుకోకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంజన్ వర్గీయులు అంటున్నారు.
ఈ క్రమంలో పొన్నంకు కొన్ని గంటల వ్యవధిలోనే ధీటైన కౌంటర్ ఇచ్చిన అంజన్‌కుమార్ ‘జూబ్లీహిల్స్ నుంచి పోటీలోకి దిగుతున్నా’ అంటూ కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా పొన్నం ప్రకటన వెనక ఉన్న ఆంతర్యాన్ని గుర్తించిన ఆయన ‘నేను పారాషూట్ నేతను కాను’ అంటూనే మంత్రి పొన్నం ప్రభాకర్ కంటే సీనియర్ అని అందరికీ ఒకే ప్యాకేజీలో కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి అంజన్‌కుమార్ యాదవ్ పార్టీలో సీనియర్ కావడంతో పాటు ఆది నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న ముఖ్యనేతల్లో ఒకరు. పైగా ఢిల్లీ అధిష్ఠానంతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఇదే అదునుగా దూకుడు పెంచిన అంజన్‌కుమార్ వర్గం మంగళవారం నియోజకవర్గంలో పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అంజన్కుమార్నే కోరుకుంటుందంటూ దాడి మొదలుపెట్టింది. పనిలో పనిగా టికెట్ ఆశిస్తున్న మరో నేత బొంతు రామ్మోహన్ సామాజిక కోణంలో నరుక్కుంటూ వస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దింపి నియోజకవర్గంలో తమ బలం ఉన్నందున తనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.
ఎవరికి ‘వారే’
జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదెలే అంటూ అధిష్ఠానం ముందట తమ దర్పం ప్రదర్శిస్తున్నారు. తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారు తమ అనుయాయులతో అధిష్ఠానం వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలోనూ తమకే టికెట్ వస్తుందనే సంకేతాలు క్యాడర్లో నింపేందుకు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు నియోజకవర్గంలో వెలిశాయి.
ఎందుకింత రాద్ధాంతం!
జూబ్లీహిల్స్‌ను గెలుచుకోవాలన్న ఆరాటంతో ఇప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించారు. పొన్నం ప్రభాకర్‌గౌడ్, తుమ్మల నాగేశ్వర్రావు, గడ్డం వివేక్‌లకు బాధ్యతలు అప్పగించారు. వీళ్లంతా నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రజలు కాంగ్రెస్ పాలనలో తమకు కష్టాలు తప్పడం లేదని చెప్తుండటంతో వాళ్లంతా కంగుతినాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతమంది మంత్రులను పెట్టి సమస్యలను పరిష్కరిస్తారా? కేవలం ఎన్నికల కోసమేనా? అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
టికెట్ దొరికేనా!
మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గ బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని అందరి కండ్లూ పడ్డాయి. అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఫహీం ఖురేషి, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ, బొంతు రామ్మోహన్ తదితర పేర్లన్నీ వినిపించాయి. ఓ దశలో నటుడు చిరంజీవి పేరును కూడా రేవంత్ వర్గం పరిశీలించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నదని సమాచారం. ఒక్క నియోజకవర్గంపై అంతమంది ఆశావహులు ఉండటంతో అధిష్ఠానం సైతం ఎవ్వరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేని అయోమయంలో పడింది. ఎట్టకేలకు అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ కేటాయించి అతడిని రూట్ నుంచి తప్పించినా మిగిలిన నాయకులంతా టికెట్ కోసం పట్టు పడుతున్నారు. ఈ దశలో వారిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టంగా మారినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.