హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ టికెట్ ముసలం కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నది. సర్వేలు… అధిష్ఠానం నిర్ణయం… అంటూ ఇన్నాళ్లూ మభ్యపెట్టి సీఎం వర్గం తాము అనుకున్న పారాచూట్ నేతకు టికెట్ ఇప్పించిందనే ఆగ్రహం పార్టీలో అగ్గి రాజేసింది. మొన్నటిదాకా ఆశతో ఉన్న నేతలంతా నవీన్యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికితోడు అభ్యర్థి నవీన్‌యాదవ్ కూడా మంత్రులను మాత్రమే పరిగణనలోనికి తీసుకొని… పార్టీలో కీలకమైన ఇతర ఆశావహులను లెక్కలోకి తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కీలకమైన సమయంలో పార్టీ చెల్లాచెదురైపోయిందనే ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జితోపాటు మంత్రులు రంగంలోకి దిగి బుజ్జగింపుల యాత్రతో నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఇప్పటికే పరిస్థితి ‘చే’జారిపోయిందని అంటున్నారు. వాస్తవానికి నవీన్ పేరును ప్రకటించే ముందుగానే నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న ఓ మంత్రి.. ముఖ్యమంత్రిని కలిసి వద్దని వారించినట్టు తెలిసింది. అయినప్పటికీ అందుకు భిన్నంగా ఏఐసీసీ ప్రకటన రావడంతో తెర వెనక ఏం జరిగిందనే చర్చ జోరుగా సాగుతున్నది. నవీన్‌యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించిన మరుక్షణం నుంచి టికెట్ ఆశించిన కీలక నేతలంతా తమ దారిన తాము నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు. నిన్నటిదాకా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ క్రికెటర్, గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టికెట్ ఇవ్వాల్సిన తమ నేతను ఎమ్మెల్సీ ఆఫర్‌తో మభ్యపెట్టి రెంటికీ చెడ్డ రేవడిలా చేశారనే ఆగ్రహం అజార్ వర్గంలో కనిపిస్తున్నది. దీంతో వీరు నవీన్యాదవ్తో కలిసి ఎంతవరకు పని చేస్తారనేది అనుమానంగానే ఉన్నదని పార్టీవర్గాలే చెప్తున్నాయి.
మరో కీలక, సీనియర్ నేత అంజన్‌కుమార్‌యాదవ్ అలకపాన్పు ఎక్కడమే కాదు.. ‘ముఖ్య’నేతతో పాటు మరో మంత్రిపై తన విమర్శనాస్ర్తాలకు పదునుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరూ తమకు స్థానికంకాని నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వినిపించని ఈ వాదాన్ని ఇప్పుడు, తన విషయంలో ఎందుకు వినిపిస్తున్నారని మండిపడుతున్నారు. తనను బుజ్జగించేందుకు వచ్చిన రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్తోపాటు మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్తో కూడా అంజన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం.
ముందుగానే నవీన్‌కు టికెట్ ఇప్పించాలనే సీఎం వర్గం వ్యూహాత్మకంగా స్థానికవాదాన్ని తెరపైకి తెచ్చిందని, అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రకటన చేశారని గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలను అంజన్ పూసగుచ్చినట్టు వివరించారని తెలుస్తున్నది. వాస్తవానికి ఈ ఎంపిక కాంగ్రెస్ పార్టీది కానేకదని… అసద్-ఖురేషీలదని అంజన్ ఘాటుగానే చెప్పినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. అధిష్ఠానమే నవీన్‌యాదవ్ పేరును ప్రకటించినందున కలిసి పనిచేయాలని ఇన్చార్జి సహా మంత్రులు సూచించినప్పటికీ అంజన్ అయిష్టంగానే మిన్నకుండినట్టు ఆయన వర్గం నేతలు చెప్తున్నారు. కార్యకర్తలతో చర్చించి, కార్యాచరణ ప్రకటిస్తానని అనడం అందులో భాగమేనంటున్నారు.
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు తిప్పలు పడతారు. కానీ, కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. నవీన్‌యాదవ్ పేరును ప్రకటించగానే పార్టీ నేతలంతా తలోదిక్కుగా తయారయ్యారు. దీంతో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు మంత్రుల పరిస్థితి ఎక్కే గడప… దిగే గడప అన్నట్టుగా బుజ్జగింపుల యాత్ర చేపట్టారు. శుక్రవారం సీనియర్ నేత అంజన్‌తోపాటు కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి, మరో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇంటికి వెళ్లి బుజ్జగింపులు చేశారు. కలిసి పనిచేయాలంటూ వారిని కోరినప్పటికీ, అది ఎంతమేరకు సఫలీకృతం అవుతుందో చెప్పడం కష్టమేనని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి.
మరోవైపు, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నవీన్‌యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మిగిలిన కీలక, సీనియర్ నేతలెవరినీ పట్టించుకోవడంలేదని పార్టీవర్గాలు చెప్తున్నాయి. అంజన్‌కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మంత్రులు తన పక్కన ఉంటే చాలనే రీతిలో నవీన్‌యాదవ్ వైఖరి ఉన్నదని ఒక నేత వ్యాఖ్యానించారు. శుక్రవారం మంత్రులతోపాటు అభ్యర్థి నవీన్ కూడా వచ్చి తనకు సహకరించాలని కోరాల్సి ఉన్నదని, కానీ ఇదంతా సంబంధం లేనట్టుగా నవీన్‌యాదవ్ శుక్రవారం ఏఐసీసీ ఇన్చార్జి విశ్వనాధన్తో కలిసి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారంటే నేతలెవర్నీ ఆయన లెక్కచేయడంలేదని శ్రేణులు చెప్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ మేరకు పలుసార్లు వీరంతా నియోజకవర్గంలో పర్యటించారు. అయితే, నవీన్యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేయడంలో వీరి మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఆదినుంచీ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో నవీన్‌యాదవ్ అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉన్నట్టు కనిపించింది. కానీ మిగిలిన ఇద్దరు మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పార్టీవర్గాలే చెప్తున్నాయి. ముఖ్యంగా మంత్రి వివేక్ ముందుగానే నవీన్‌యాదవ్‌కు కాకుండా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచన కూడా చేశారని ప్రచారం జరుగుతున్నది. కానీ, సీఎం మాత్రం ఆయన సూచనలను పెడచెవిన పెట్టినట్టు తెలుస్తున్నది. అందుకే మంత్రి వివేక్ కొన్నిరోజుల క్రితం అంజన్‌కుమార్ జూబ్లీహిల్స్‌లోని కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు శుక్రవారం మీనాక్షి , పొన్నం వెళ్లిపోయిన తర్వాత అంజన్తోనే చాలాసేపు ఉన్నారు.