హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 ( నమస్తే తెలంగాణ ): మాగంటి గోపీనాథ్ మరణవార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోకముందే కాంగ్రెస్ నాయకులు ఎవరికివారు టికెట్ గురించి చేస్తున్న ప్రకటనలను చూసి జనం చీదరించుకుంటున్నారు. మాగంటి మృతి చెంది రెండు వారాలే అవుతున్నది. అప్పుడే టికెట్ కోసం కాంగ్రెస్ నాయకులు పోటీపడుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశావహులు ఎవరికి వారే జూబ్లీహిల్స్ టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే ఒక టీవీ చానల్‌తో సర్వే చేయించింది. అయితే, సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ నిరాశలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు హస్తం పార్టీ అంతర్గతంగా ఓ సర్వే చేయించింది. ఆ బాధ్యతను పార్టీ నేతకు చెందిన ఓ చానల్‌కు అప్పగించింది. ఆ చానల్ ప్రతినిధులు నియోజకవర్గం మొత్తం తిరిగి ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నారు.
అనంతరం నివేదికను పార్టీ పెద్దలకు పంపించారు. ఆ రిపోర్ట్‌ను చూసి కాంగ్రెస్ నాయకులు షాకయ్యారట. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయింది చాలని, మళ్లీ ఆ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని ఓటర్లు తేల్చి చెప్పారు. ఇది బీఆర్ఎస్ అడ్డా అని, కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా వారికే ఓటు వేస్తామని ఓటర్లు తేల్చి చెప్పినట్టు సర్వేలో తేలింది. అలాగే, ఇక్కడి నుంచి ఓ నాయకుడు పోటీ చేస్తానని ప్రకటించాడని, ఆయనపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు.. ఆయన ఎన్నిసార్లు ఓడిపోతాడంటూ వ్యంగ్యంగా స్పందించినట్టు తెలిసింది. ఈ సర్వే రిపోర్టును చూసిన హస్తం ముఖ్యులు బిత్తరపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టికెట్ కోసం వస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఆ పార్టీ టికెట్ ఖరారు చేయకుండా టికెట్ కోసం పోటీలు తగవని హితవు పలికినట్టు తెలిసింది.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం గ్రేటర్ నాయకులు అప్పుడే పైరవీలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించుకున్నారు. తనకు టికెట్ రాదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని సొంతపార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్ సైతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు, దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తండి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో తనకు టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుపడుతున్నట్టు సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ సైతం జూబ్లీహిల్స్ టికెట్ తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. పాతబస్తీ నుంచి తనకు గతంలో గెలిచే అవకాశాలు రాలేదని, కాబట్టి జూబ్లీహిల్స్ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. వీరితో పాటు నవీన్‌యాదవ్, ఫహీమ్ ఖురేషీ కూడా తమ పలుకుబడితో టికెట్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలిసింది. కాగా మాగంటి గోపీనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.