హిమాయత్‌నగర్, జూలై 22: దేశవ్యాప్తం గా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న చలో పార్లమెంట్‌కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మీడియా కమిషన్‌ను ఏ ర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ, జర్నలిస్టుల రక్షణ చట్టం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు చే యాలని డిమాండ్ చేశారు. కొన్ని రాష్ర్టాల్లో పింఛన్ అమలు చేస్తు న్నా, దేశవ్యాప్తంగా ఒకేవిధానాన్ని అమలు చేసేలా చూడాలని కోరారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపునకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రులు, ఎంపీలను కలిసి వినతి పత్రాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్ కుమార్‌గౌడ్, నగర కన్వీనర్ రవికుమార్, రంగారెడ్డి జిల్లా కోకన్వీనర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.