హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ) : నేటి ఆధునిక యుగంలో జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవన్లో మంగళవారం జర్నలిస్టుల చర్చా కార్యక్రమం నిర్వహించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు, అకాడమీ అనుబంధ సభ్యులు పాల్గొన్నారు. మీడియా భవిష్యత్తు, డిజిటలైజేషన్, మీడియా చట్టాలు, శిక్షణ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాలశాఖ ప్రత్యేక ప్రధాన కమిషనర్ జీ ముకుంద్‌రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ చదివే రోజుల్లో పత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం ద్వారా సివిల్ సర్వీసులపై ఆసక్తి పెరిగిందని, అదే తన విజయానికి పునాది అయిందని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు ఐ వెంకట్రావ్ మాట్లాడుతూ.. మీడియా అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ మరిన్ని పుస్తకాలను అకాడమీకి అందజేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ అమీర్‌అలీఖాన్ మాట్లాడుతూ.. జర్నలిజం తనకు ధైర్యం, గుర్తింపు ఇచ్చిందని పేరొంటూ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఉడుముల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక జర్నలిజానికి అనుగుణంగా అకాడమీ డిజిటల్ క్లాసులు, ఇంక్యూబేటర్ ఏర్పాటుచేయాలని, గ్యాగ్ ఆర్డర్ వంటి అంశాలపై చర్చలు నిర్వహించాలని సూచించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. 16 మంది వెటరన్ జర్నలిస్టుల వీడియోలను పుస్తకాల రూపంలో తీసుకురావాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు కే రామచంద్రమూర్తి, కేశవరావు దాసు, నాగేశ్‌కుమార్, బండారు శ్రీనివాసరావు, రవీందర్, దిలీప్‌రెడ్డి, మాడభూషి శ్రీధర్, ఎం సుబ్బారావు, జగన్, ఆర్వీ రామారావు, ఎస్ వినయ్‌కుమార్, వై నరేందర్‌రెడ్డి, విరాహత్ అలీ తదితరులు పాల్గొని మీడియా రంగంలో వస్తున్న మార్పులు, డిజిటలైజేషన్, జర్నలిస్టుల శిక్షణ, మీడియా చట్టాలు, సోషల్ మీడియా ప్రభావంపై తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇతర జర్నలిస్టులు మాట్లాడుతూ.. మీడియా చట్టాల్లో కాలానుగుణ మార్పులు అవసరమని, సోషల్ మీడియాకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి తీసుకురావాలని పేరొన్నారు. మహిళా, గ్రామీణ జర్నలిస్టుల కోసం శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ.. మీడియా రంగంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) ప్రభావం పెరుగుతున్నదని, జర్నలిస్టులు దీనిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. అకాడమీ భవన్లో డిజిటల్ సదుపాయాలు, ఆధునిక ఆడిటోరియం, బోర్డురూమ్, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్ వంటి వసతులను మరింత సమర్థవంతంగా వినియోగించి జర్నలిస్టులకు ప్రయోజనం చేకూర్చాలని, పాతపత్రికలు, అరుదైన పుస్తకాలు, నిజాం కాలంనాటి ప్రచురణలు, తెలుగు గ్రంథాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్తుతరాలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.