ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక వ్యాఖ్యాత మాట్లాడుతూ.. ‘అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం భయం కూడా భయపడి పారిపోయేంతగా ప్రజలను భయపెట్టింది. దాంతో ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘జర్నలిస్ట్‌లను భయపెట్టాలి’ అని వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఈ ఇరాన్ పరిణామాల వ్యాఖ్యను గుర్తు చేసే విధంగా ఉన్నది. ఒక మంత్రి ఐఏఎస్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఎన్టీవీ న్యూస్ చానల్లో ఒక వార్త ప్రసారమైంది. ఆ వార్త పలు యూట్యూబ్ చానల్స్, పలు మీడియా చానళ్లలో రిపీట్ అయింది. ఈ వార్త కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒకవేళ హైకమాండ్ తప్పిస్తే.. ఆ స్థానంలో నిలిచే వారు ఎవరు? అంటే వినిపించే రెండు మూడు పేర్లలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉంటారనేది బలమైన ప్రచారం.
దీనిని అడ్డుకోవడానికి పాలకుల కనుసన్నల్లో మెలిగే మీడియాలో ఆ మంత్రికి వ్యతిరేకంగా ఈ వార్తను ప్రసారం చేశారనే ప్రచారం సాగుతున్నది. ఏ మీడియా యాజమాన్యం కూడా ప్రభుత్వంతో ఘర్షణపడే పరిస్థితిలేదు. కరోనా తరువాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చిన్నగాలి వీచినా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘లార్జెస్ట్ సర్క్యులేట్’ అని గర్వంగా ముద్రించుకునే పత్రికలే పేజీలు తగ్గించుకొని గుట్టుగా నెట్టుకొస్తున్న కాలం. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షం తమ రాజకీయ పోరాటంలో భాగంగా ఒక మంత్రిపై ఇలాంటి వార్తాలు ప్రసారం చేయించిందని యజమాని చెప్పలేడు. జైలుపాలైన జర్నలిస్ట్‌లూ వాస్తవం ఏమిటో చెప్పలేరు. అధికార పక్షం గ్రూప్ రాజకీయాలకు, మీడియా యాజమాన్యం బలహీనతకు బడుగు జర్నలిస్ట్‌లు జైలు పాలు అవుతున్నారు. ఎవరి రాజకీయం వారు సాగిస్తారే కానీ, అసలు వాస్తవం ఏమిటనేది వాస్తవం తెలిసిన వారు కూడా చెప్పరు.
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడానికి కొన్ని యూట్యూబ్ చానల్స్‌ను వాడుకునేవారనే వార్తలు కూడా వచ్చాయి. అసభ్యకర వార్తలు ప్రసారం చేస్తుండటంతో అప్పట్లో పోలీసులు ఆ యూట్యూబ్ చానల్స్‌ను ప్రసారంచేస్తున్న ఆఫీస్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే కాదు; చివరకు రేవంత్‌రెడ్డికి అడ్డుగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులకు వ్యతిరేకంగా కూడా ఆ యూట్యూబ్స్‌లో ప్రసారం చేసేవారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు. ఆనాటి సీనియర్లపై సొంత పార్టీ వారే యూట్యూబ్‌లో వ్యతిరేకంగా ప్రచారం చేయించారనే ఆరోపణ బహిరంగంగానే సీనియర్లు చేయడంతో, ఇప్పుడు మంత్రిపై సాగిన ప్రచారానికి కూడా సొంత పార్టీలోని గ్రూప్ తగాదాలే కారణం కావచ్చుననే ప్రచారానికి బలం చేకూరింది. అధికార పక్షం పెద్దలే చేయించారనే ప్రచారం బలంగా సాగడంతో రాజకీయ వ్యూహంతో ముగ్గురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేశారు. ఆ వార్త వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి? ఎవరు ఆడిస్తున్న నాటకం? అనేది బయటకు రాదు. తెలిసిన జర్నలిస్ట్‌లు చెప్పే పరిస్థితి లేదు.
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఎన్నోసార్లు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ కూడా అవే అసభ్యకరమైన మాటలను మీడియా సమావేశంలోనే మాట్లాడారు. ఇప్పుడు విచారణ కోసం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మాట్లాడిన అభ్యంతరకరమైన మాటలపై కూడా విచారణ బాధ్యత సిట్‌కు అప్పగించాలి. రాజకీయ వ్యూహంతో సిట్ విచారణలకు ఆదేశించలేదని, నిష్పక్షపాతంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పాలనుకుంటే.. ఎన్టీవీ చానల్ ఒక మంత్రిపై ప్రసారం చేసిన వార్త కన్నా.. కేటీఆర్‌పై అసభ్యకరమైన ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి, కొండా సురేఖపై కూడా సిట్ విచారణ చేయాలి. సిట్ విచారణ అంశంలో వీరిద్దరి మాటలను కూడా చేర్చాలి.
ఇండ్లలో చొరబడి జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేస్తున్నా ఘనత వహించిన పలు జర్నలిస్ట్ సంఘాలు, వాటి జాతీయ నాయకులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారేమో.. మౌనంగానే ఉన్నారు! జర్నలిస్ట్‌ల జీవితాలు సామాన్యమైనవి. ఇలా అరెస్ట్‌ల ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలనే ప్రయత్నమే తప్ప కేసు నిలిచేది కాదు. ఒకవేళ అలాంటి మాటలకు కఠిన శిక్షలే పడితే.. అవే మాటలు ఎన్నోసార్లు మీడియా సమక్షంలోనే మాట్లాడిన సీఎం, మంత్రి కూడా అనుభవించాల్సి వస్తుంది. చట్టం అందరికీ సమానమే కదా?
‘నన్ను ఏమైనా అనండి భరిస్తాను కానీ, తెలంగాణను అపహాస్యం చేస్తే వంద అడుగుల లోతులో పాతిపెడతాను.. తెలంగాణ వాళ్లు కల్లు తాగే ముఖాలు అంటూ చిన్నచూపు చూస్తే.. ’ అని కేసీఆర్ అంటేనే నాడు జర్నలిస్ట్ జాతీయ సంఘాల నాయకులు జాతీయ స్థాయిలో చర్చ పెట్టారు. కానీ, ఇప్పుడు ముగ్గురు జర్నలిస్ట్‌లను అమానుషంగా అరెస్ట్ చేసినా మౌనంగానే ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో జర్నలిస్ట్‌లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా కేసీఆర్ హయాంలో ఇచ్చిన కార్డులకు మూడు నెలలకు ఒకసారి చిట్టీ అతుకు బెడుతున్నారు. ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, ఆరోగ్యబీమా, మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల సహాయం హామీలు ఇచ్చినా ప్రభుత్వం మరచిపోయింది. జర్నలిస్టు సంఘాల నాయకులకు గుర్తు చేసే తీరికలేదు. మీడియా అకాడమీ పేరుతో కేసీఆర్ హయాంలో రూ.40 కోట్లు డిపాజిట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.పది కోట్లు డిపాజిట్ చేస్తామని ప్రకటించినా ఏమీ ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో డిపాజిట్ చేసిన రూ.40 కోట్లతోనే ఇప్పుడు మీడియా అకాడమీ కార్యకలాపాలు నడుస్తున్నాయి.
టీడీపీలో, కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే మీడియాను మీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని రేవంత్‌రెడ్డి తిట్టినా అడిగే వారు లేరు. సీఎం అయిన తరువాత కూడా అదే భాష. జర్నలిస్టుల భయం జర్నలిస్ట్లది, నాయకుల అవసరాలు నాయకులవి. ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల గడువు ఉండటంతో ఎవరూ నోరువిప్పలేని పరిస్థితి. ఇప్పుడు కనీసం జర్నలిస్ట్‌లకు సచివాలయంలోకి వెళ్లే అధికారం కూడా లేదు. సాధారణ ప్రజల మాదిరిగా ఆధార్‌కార్డు చూపించి సందర్శకులు వెళ్లే సమయంలో వారితోపాటు వెళ్లాల్సిందే. జర్నలిస్ట్‌లను సచివాలయానికి ఎలా అనుమతించాలనే అంశంపై విధి విధానాలు రూపొందిస్తామని రెండేండ్ల క్రితం ప్రకటించారు. విధి విధానాలు తుదిరూపు దాల్చడానికి ఇంకో మూడేండ్లు పడుతుందేమో!
గతంలో ఎప్పుడూ లేనంత దయనీయమైన దుస్థితిలో మీడియా పరిస్థితి ఉన్నది. దాదాపు అన్ని మీడియాలు రాజకీయ పక్షాలకు అనుబంధంగా ఎప్పటినుంచో ఉంటున్నాయి. కానీ, ఇంత దయనీయమైన పరిస్థితి లేదు. జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేసినా మాట్లాడలేని పరిస్థితి. కనీసం పాలకుల అనుమతి తీసుకుని అయినా స్పందించాలి!
రాహుల్‌గాంధీ ‘మొహబ్బత్ కే దుకాణ్’ అంటూ దేశమంతటా తిరుగుతుంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం తన పాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముగ్గురు జర్నలిస్ట్‌ల అరెస్ట్ వ్యవహారం ఒక్క దానిలోనే కాదు; మొదటి నుంచీ ఇలానే ఉన్నది. తాను అధికారంలోకి రావడానికి యూట్యూబ్‌ల ద్వారా సాగించిన ప్రచారం బాగా ఉపయోగపడిందని రేవంత్‌రెడ్డికి బాగా తెలుసు. అందుకే, అధికారంలోకి రాగానే యూట్యూబ్‌లు తనకు వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తే తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక సమావేశంలో ‘మీడియా అంటే ఎవరు?’ అంటూ యూట్యూబ్‌లను తీవ్రంగా విమర్శించారు. ఈ మాటలపై నాయకులు, చానల్స్, పత్రికల్లో బోలెడు చర్చలు నిర్వహించారు. ఇప్పుడు ముగ్గురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేసినా చర్చలు లేవు, స్పందనలు లేవు. ఎవరి కష్టాలు వారివి.
కఠినమైన ఇస్లామిక్ పాలనపైనే ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో ఓపిక ఉన్నంత వరకే ఏ నియంతకైనా చెల్లుబాటు అవుతుంది. డిక్టేటర్లకే కాలం చెల్లినప్పుడు సామంత రాజులు ఎంత? ఢిల్లీ సుల్తాన్లకు కోపం వచ్చేంత వరకే వీరి ఆటలు. అంతిమ తీర్పు చెప్పాల్సింది ప్రజలు. సరైన సమయంలో సరైన తీర్పు చెబుతారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ కూడా జర్నలిస్ట్‌లను బెదిరించలేదు. ఇప్పుడు అర్ధరాత్రి అరెస్ట్‌లు చేస్తున్నారు. తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇందిరమ్మ మనవడు ఏమంటారో చూడాలి. ఇరాన్లో భయానికే భయం కలిగేటట్లు ప్రభుత్వం వ్యవహరిస్తే.. భయం పోయి జనం తిరగబడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీడియాను ఇలానే భయపెట్టాలని చూస్తే ఒక దశ దాటాక భయాన్ని భయపెడుతూ ఉద్యమిస్తారు.
బుద్దా మురళి