ఖైరతాబాద్, అక్టోబర్ 14: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మిస్తున్న నేవీ రాడార్ కేంద్రం ప్రాజెక్టుతో మానవ మనుగడే ప్రమాదమని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టు సంపత్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాడార్ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాలను వక్తలు ఎత్తిచూపారు. జర్నలిస్టు తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాడార్ స్టేషన్‌ను ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి బంధం అర్థమవుతుందని, దీనిపై రాహుల్‌గాంధీ స్పష్టత ఇవ్వాలని కోరారు.
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజలు, పర్యావరణానికి నష్టం చేకూర్చే వీఎల్ఎఫ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను దెబ్బతీస్తున్నారని, ఇందులో పాలకుల మతలబు వేరే ఉంటుందని చెప్పారు. పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ బాబురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టులో స్థానికులకు ఎలా ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నించారు. ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రాజెక్టులకు సముద్రతీరాలను ఎంచుకోవాలని కోరారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని చెట్లు పెరగని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించుకోవాలని సూచించారు. ైక్లెమెట్ ఫ్రంట్ ప్రతినిధి రుచిత్ మాట్లాడుతూ ఈ అడవికి బదులు 17లక్షల మొక్కలు నాటుతామని చెబుతున్నారని, అది ఫెల్యూర్ ప్రక్రియ అని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్, జర్నలిస్టు తులసి చందు తదితరులు పాల్గొన్నారు.