హైదరాబాద్ జూన్ 28 (నమస్తే తెలంగాణ): ‘అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తాం..రూ. 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం.. ఇండ్ల స్థలాలు కేటాయిస్తాం..రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తాం.. మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం’ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సంక్షేమ నిధి ఊసే ఎత్తడంలేదు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అటకెక్కించింది. కనీసం కొత్త అక్రెడిటేషన్ల జారీని కూడా మరిచిపోయింది. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరించడం తప్ప ఈ దిశగా కనీస చర్యలు చేపట్టడంలేదు. పదేపదే గడువు తేదీని పొడిగిస్తూ అక్రెడిటేషన్ల జారీని ఓ ప్రహసనంగా మార్చింది. ప్రభుత్వ వైఖరిపై జర్నలిస్టు సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో జర్నలిస్టులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును నిర్లక్ష్యం చేస్తున్నదని పాత్రికేయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులు కేటాయించగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నయాపైసా కేటాయించలేదని మండిపడుతున్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండ్ల స్థలాల కేటాయింపు ఊసే మరిచిందని విమర్శలు గుప్పిస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని 16,333 మంది వర్కింగ్ జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో అక్రెడిటేషన్ కార్డులు జారీచేసింది. 2024 జూన్లో అవి రెన్యువల్ కావాల్సి ఉంది. కానీ అప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రెడిటేషన్ల జారీ గడువును తొలిసారి మూడు నెలలకు 2024 సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 30 వరకు రెండోసారి వాయిదా వేసింది. మళ్లీ మార్చి 30, 2025 వరకు మూడోసారి, జూన్ 30 2025 వరకు నాలుగోసారి, తాజాగా సెప్టెంబర్ 30, 2025 వరకు ఐదోసారి గడువు పొడిగించింది. ఇప్పట్లో కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేయబోమని పరోక్షంగా స్పష్టం చేసింది.
సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న హైదరాబాద్లోని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పరిష్కరించలేమని కొంతకాలం నాన్చుతూ వచ్చింది. నిరుడు అక్టోబర్లో కోర్టు తీర్పుకూడా వచ్చింది. ఆ తీర్పు అనంతరం ఇండ్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడంపై జర్నలిస్టు సంఘాలనేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.