శంకరపట్నం, జనవరి 26 : మహబూబాబాద్ జిల్లా గార్ల నమస్తే తెలంగాణ విలేకరి సోమయ్యపై దాడిని నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక కమిటీ శంకరపట్నం మండల కన్వీనర్ దేవునూరి రవీందర్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు చేయడం, భయపెట్టడం సరికాదని అన్నారు. దాడులు చేస్తూ జర్నలిస్టుల్లోని ఐక్యతను దూరం చేయలేరని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కోరెం శ్రీనివాస్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గోపు శ్రీనివాస్‌రెడ్డి, సలహాదారు కొర్మి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్, కోశాధికారి గొర్ల అ నిల్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
విలేకరిపై దాడి కేసులో ఇద్దరు అరెస్టు
గార్ల, జనవరి 26 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ‘నమస్తే తెలంగాణ’ విలేకరి సోమయ్యపై ఈ నెల 24న దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు భూక్యా నాగేశ్వర్రావు, గులగట్టు లెనిన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ దాడిపై జిల్లాకు చెందిన అన్ని వర్గాలతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పోలీసులు ఇద్దరిపై 296(బీ), 115 (2), 351(2) ఆర్/డబ్లూ, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి మహబూబాబాద్ కోర్టులో హాజరు పరిచారు. వీరికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు ఎస్సై సాయికుమార్ తెలిపారు.