వారి కుటుంబాలను భయాందోళనలకు గురిచేయడం గర్హనీయం: టీడబ్ల్యూజేఎఫ్
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి నోటీసులు, సెర్చ్ వారెంట్, విచారణ లేకుండానే జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పీ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్ధరాత్రి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యేలా పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. వరింగ్ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వార్తల ప్రసారంలో అభ్యంతరం ఉంటే ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా ఇష్ఠానుసారం వ్యవహరించడం ప్రభుత్వానికి సరికాదని హతవు పలికారు. వార్తల ప్రచురణ, ప్రసారాలకు మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలని సూచించారు.