యైటింక్లయిన్ కాలనీ, మే 10 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ (28) అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన పది రోజుల తర్వాత బయటపడ్డ ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ కథనం ప్రకారం.. మంథని గాడిదలగండిగుట్ట వద్ద కుళ్లిన మృతదేహం ఉందని ఆదివారం వచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గత నెల 30న రామగిరి మండలం సింగిరెడ్డిపల్లెకు చెందిన జూల వంశీ కనిపించకుండా పోయినట్లు కుటుంబసభ్యులు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేయగా, మృతదేహం వంశీదిగా గుర్తించి అతడి సెల్ డాటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
సింగిరెడ్డిపల్లెకు చెందిన ఒక యువతిని వంశీ ప్రేమించగా, కొన్నాళ్ల తర్వాత ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఇటీవల గ్రామదేవతల కొలుపు సందర్భంగా గ్రామానికి వచ్చిన యువతితో వంశీ మాటలు కలిపాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు తరచుగా నడువడంతో ఈ విషయం భర్త కంటపడింది.
దీంతో ఆమె భర్త గత నెల 30న వంశీని హైదరాబాద్కు పిలిపించి, పథకం ప్రకారం హత్య చేసి మంథని సమీపంలోని గాడిదలగండిగుట్ట వద్దకు తీసుకువచ్చి పడేశారు. ఈ విషయాన్ని నిందితులైన భార్యాభర్తలు ఒప్పుకొన్నారు. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.