హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్-తెలంగాణల మధ్య ఉమ్మడి ఆస్తులు, అప్పులను వెంటనే విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు పూర్తవుతున్నా ఇంకా ఉమ్మడి ఆస్తుల విభజన జరగకపోవడం ఏపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లో పొందుపరిచిన హకులతోపాటు విభజన అనంతరం ఏపీ ప్రజలకు దకాల్సిన ప్రయోజనాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలకు సమానంగా, న్యాయమైన పద్ధతిలో త్వరగా ఆస్తులు, అప్పులను విభజించాలని విన్నవించింది. షెడ్యూల్ 3లో పేర్కొన్న 31 ఆస్తులు, షెడ్యూల్ 10లోని 112 ఆస్తులతోపాటు చట్టంలో లేని 12 ఆస్తుల్లో ఇప్పటివరకూ దేనినీ విభజించలేదని తెలిపింది. మొత్తం రూ.1,42,601 కోట్ల విలువైన ఈ ఆస్తులను విభజించకపోవడం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతున్నదని పేర్కొన్నది.
వీటిలో 91 శాతం ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపింది. షెడ్యూల్ 9లో పేరొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు రూ.24,018.53 కోట్ల మేరకు ఉన్నదని, వీటిలో రూ.22,556.45 కోట్ల విలువైన 93 శాతం ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని వివరించింది. షెడ్యూల్ 10లోని రూ.34, 642.77 కోట్ల ఉమ్మడి ఆస్తుల్లో రూ.30,530.86 కోట్ల విలువైన 88 శాతం ఆస్తులతోపాటు చట్టంలో పేర్కొనని రూ.1,750 కోట్ల విలువైన 12 ఉమ్మడి ఆస్తులు కూడా తెలంగాణలోనే ఉన్నట్టు తెలిపింది. ఎనిమిదేండ్ల తర్వాత కూడా ఈ ఆస్తులను విభజించక పోవడం వల్ల అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక, రాజ్యాంగ హకులకు భంగం కలుగుతున్నదని, రాష్ట్ర విభజన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నది.