John Wesly | సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జాన్వెస్లి ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరిగిన సీపీఎం మహాసభల్లో జాన్వెస్లీని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింత ప్రాంతానికి చెందిన జాన్వెస్లీ.. ప్రస్తుతం వనపర్తి జిల్లాలోకి వస్తుంది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. సీపీఎం రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక దళితుడ్ని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షుడిగా జాన్ వెస్లీ పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు. తర్వాత జరిగిన రెండు మహాసభల్లోనూ ఆయన తిరిగి ఎన్నికయ్యారు. తాజాగా సంగారెడ్డిలో జరిగిన సీపీఎం మూడో మహాసభలో జాన్ వెస్లీని మహాసభలకు హాజరైన ప్రతినిధులు ఎన్నుకున్నారు.
ఈ మహాసభల్లో సీపీఎం చరిత్రలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన తమ్మినేని వీరభద్రం.. వయస్సు రీత్యా ఈ మహాసభల్లో పార్టీ రాష్ట్ర కమిటీ నుంచే తప్పించారు. ఆయనతోపాటు సీనియర్ నేతలు సీతారాములు, నర్సింగరావులను కూడా తొలగించారు. 70 ఏండ్లు దాటిన నేతలను రాష్ట్ర కమిటీ నుంచి తొలగిస్తూ సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్ణయం తీసుకున్నాయి.