ఆదిలాబాద్, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆదిలాబాద్‌లో ప్రైవేట్ కేసు పెడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల ను అమలు చేయకపోయినా చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడు తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, దీంతో తాము ప్రైవేట్ కేసు పెడుతున్నామని ఈ విషయమై న్యాయవాదితో చర్చించినట్టు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ మరోసారి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రూ.2,500, స్కూటీలు మరిచిపోయారని, రూ.500 సిలిండర్ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాలను ఎందు కు రద్దు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.