హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ) : యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రాం’ కింద ఐదు నెలలపాలు శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయాన్(టీసీఎస్ ఐఓఎన్)యాజమాన్యానికి ఆయన కృతజ్ణతలు తెలిపారు.
గురువారం సచివాలయంలో మంత్రి సమక్షంలో ఇందుకు సంబంధించి జేఎన్టీయూహెచ్-టీసీఎస్ అయాన్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సీటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టమని పేర్కొన్నారు. ఏదో ఒక అంశంలో నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మంథని జేఎన్టీయూ విద్యార్థులను ఎంపికచేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, సిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ సృ్మతి ముల్యే, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.