హుజూర్నగర్, జనవరి 10 : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ నిరుపేద కుటుంబానికి దైవంగా మారారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన సరికొండ సురేశ్రాజు పుట్టుకతో దివ్యాంగుడు. చిన్నతనంలోనే తండ్రి సుబ్బరాజు చనిపోయాడు. తల్లి లక్ష్మమ్మ తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే సురేశ్రాజును బాగా చదివించింది. అమ్మ కష్టాన్ని చూసి చలించిపోయిన రాజు కుటుంబానికి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో ఉద్యోగం కోసం వెతికాడు.
ఈ క్రమంలో ఈ నెల 6న హుజూర్నగర్ వచ్చిన మంత్రి కేటీఆర్‌ను తల్లి సాయంతో కలిసి తన పరిస్థితిని వివరించాడు. చలించిపోయిన మంత్రి కేటీఆర్ సురేశ్‌కు వెంటనే ఉద్యోగం వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో మేళ్లచెర్వు మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఐసీ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు ఆర్డీవో వెంకారెడ్డి మంగళవారం సురేశ్రాజుకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. తనకు ఉద్యోగం ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు, సహకరించిన ఎమ్మెల్యే సైదిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.