హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దళిత యువత నైపుణ్యాలను మెరుగుపరచుకొని, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో విన్సోల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దళిత యువతకు వెబ్ డెవలపర్, ఫ్రంట్ ఆఫీస్ కోర్సుల్లో నిర్వహించిన నైపుణ్య శిక్షణా శిబిరం శనివారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఆయా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారానే ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్, రవీందర్ పాల్గొన్నారు.