హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో జేఎన్టీయూ కుచ్చుటోపీ పెడుతున్నది. 2001 నుంచి 2003 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొంది, వివిధ కారణాలతో ఫెయిలై, తిరిగి ఇప్పుడు సెటిల్మెంట్ కోసం ముందుకు వచ్చిన ఒక్కొక్క విద్యార్థికి ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం కోసం అక్షరాల రూ.1.18 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ విధానం గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అమల్లో ఉండటం గమనార్హం. 2001 నుంచి 2003 విద్యా సంవత్సరం వరకు అడ్మిషన్లు పొంది ఫెయిలైన విద్యార్థులు పాస్ కావడం, ప్రాజెక్టులు దాఖలు చేయడం కోసం అనుమతిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీచేశారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు.
కానీ ప్రాజెక్టుల అనుమతిలో మెలిక పెట్టారు. 2020లో అడ్మిషన్ పొందిన వారికి రూ.28,000 ఫైన్‌గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి రెండు లేదా మూడు విద్యా సంవత్సరాలకు రూ.10,000 కలిపారు. దీంతో 2001 నుంచి 2003 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు అధిక భారం పడింది. 2004 వారికి రూ.1.08 లక్షలు, 2005, 2006 వారికి రూ.98 వేల చొప్పున వన్‌టైమ్ ఫీజుగా నిర్ణయించారు. దీంతో విద్యార్థుల్లో చాలా మంది ఈ ఫీజులు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. జేఎన్టీయూ మాత్రం వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో ప్రతి ఏడాది రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంటుంది. ఈ డబ్బుల్లో అధిక మొత్తం దుర్వినియోగం అవుతున్నదని, దీనిపై పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని బాధిత విద్యార్థులు జేఎన్టీయూ వీసీ, రిజిస్ట్రార్‌ను కోరుతున్నారు. ఈ విధానం 15 ఏండ్ల నుంచి అమలు చేస్తున్నామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు వెల్లడించారు. ప్రతి ఏడాది కొంత శాతం ఫీజులు పెంచే విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. ఫీజులు వెనక్కి తీసుకోవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. ప్రాజెక్టు అనుమతి విషయంలో అనేక ప్రక్రియలు ఉంటాయని, దాని కోసం అనేక ఖర్చులు ఉంటాయని వివరించారు.