హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌లో జేఎన్టీయూ కీలక సంస్కరణలు చేపడుతున్నది. ఎప్‌సెట్ పరీక్ష రాసిన వెంటనే ఆ విద్యార్థికి సంబంధించిన మార్కులు అప్పటికప్పుడే స్క్రీన్‌పై కనిపించే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటికే జీ మ్యాట్ పరీక్షలో ఇలాంటి విధానాన్ని అనుసరిస్తుండగా, ఎప్‌సెట్‌లో దీనిని ప్రవేశపెట్టనున్నారు. పరీక్ష సమయం పూర్తికాగానే కంప్యూటర్ దానికదే షట్‌డౌన్ అవుతుంది. షట్‌డౌన్ అయిన నిమిషాల్లో ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో డిస్ప్లే అవుతుంది. అయితే, స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యేవి ప్రాథమిక మార్కులే. వీటి ద్వారా విద్యార్థికి ఓ అంచనా వస్తుంది. ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి, ఫైనల్ కీ ఖరారుచేసి, తుది ఫలితాలు, ర్యాంకులు వెల్లడిస్తారు. సాధారణంగా ప్రాథమిక, తుది ఫలితాలకు ఒకట్రెండు మార్కులు తేడా మాత్రమే ఉండే చాన్స్ ఉంటుంది. ఇక ఈసారి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
ఎప్‌సెట్ పరీక్ష తర్వాత కొందరు విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటారు. ఆన్లైన్ పరీక్ష కావడం, సమయం సరిపోకపోవడం, హడావుడిగా పరీక్ష రాసేసి వస్తున్నారు. ఇక ఫలితాలొచ్చే వరకు ఒకటే ఉత్కంఠ. ర్యాంకు ఎంత వస్తుందోనన్న భయం విద్యార్థులను వెన్నాడుతుంది. నిరుడు అలాగే జరిగింది. పేపర్ కఠినంగా రావడంతో చాలామంది మంచి ర్యాంక్ రాదేమోనని ఆందోళన చెందారు. తీరా ఫలితాలు చూస్తే 160కి 80 మార్కులకుపైగా వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 మార్కులకుపైగా వచ్చిన వారు 2,613 మంది మాత్రమే ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 2,726 మంది మాత్రమే 80కి పైగా మార్కులు సాధించారు. వీరంతా ఐదువేల ర్యాంకులోపే ఉన్నారు. కానీ, మార్కులేమో సగమే. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వచ్చిందన్న వివరాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. తద్వారా విద్యార్థులకు ఓ అంచనా వస్తుంది. తమకు ఫలానా ర్యాంకు వస్తుందన్న అంచనా ఏర్పడుతుంది. దీంతో విద్యార్థుల్లోని టెన్షన్‌ను దూరం చేయవచ్చని జేఎన్టీయూ వర్గాలంటున్నాయి.
ఈ ఏడాది నుంచి ఎప్‌సెట్ పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. పది వేల రూపాయల ఆలస్య రుసుముతో ఇలాంటి అవకాశాన్ని జేఎన్టీయూ కల్పించనున్నది. మే 4వ తేదీ నుంచి ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మే 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రూ.10 వేల ఫైన్‌తో ఎప్‌సెట్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొందరు విద్యార్థులు చివరి నిమిషంలో దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ వెసులుబాటు కల్పించినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానున్నది. ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ అధికారులు ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం జేఎన్టీయూలో నిర్వహించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి, మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎప్‌సెట్ షెడ్యూల్‌ను ఖరారుచేసి, విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఎప్‌సెట్ పరీక్షలను మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.