30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు?
ముప్ఫై లక్షలు ముట్టజెప్పితే ప్రొఫెసర్ పోస్టు మీకే. అడ్వాన్సులు ముందే ఇవ్వండి.. మిగతా సొమ్ము తర్వాత ఇచ్చుకోండి. ఆ సొమ్ము కూడా పలానా వారి వద్ద డిపాజిట్ చేసి ఉంచండి. ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆ డిపాజిట్ రిలీజ్ అవుతది.. ఇదీ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం అక్రమ వసూళ్ల పర్వంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ఇవే కాకుండా మరికొన్ని పోస్టులకు బేరసారాలు జరుగుతున్నట్టు గుసగుసలు గుప్పుమంటున్నాయి.
- జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!
- పాత ఫైళ్లకు దుమ్ము దులుపుతున్న ‘మేడం’
- 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రూట్ క్లియర్!
- పాత ఫైల్‌కు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్
- దీన్ని అడ్డం పెట్టుకొని మరిన్ని పోస్టులకు బేరం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముప్ఫై లక్షలు ముట్టజెప్పితే ప్రొఫెసర్ పోస్టు మీకే. అడ్వాన్సులు ముందే ఇవ్వండి.. మిగతా సొమ్ము తర్వాత ఇచ్చుకోండి. ఆ సొమ్ము కూడా పలానా వారి వద్ద డిపాజిట్ చేసి ఉంచండి. ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆ డిపాజిట్ రిలీజ్ అవుతది.. ఇదీ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం అక్రమ వసూళ్ల పర్వంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ఇవే కాకుండా మరికొన్ని పోస్టులకు బేరసారాలు జరుగుతున్నట్టు గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇదేకాకుండా పలు అవినీతి ఆరోపణలు వర్సిటీని అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా ఇక్కడ కొందరు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఇక్కడి ‘జేజమ్మ’కు పట్టపగ్గాలే లేవు. ఇప్పుడు ఆమెకు తోడుగా మరో చిన్న జేజమ్మ కూడా తోడైంది. ఇక వీరు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. పాలన అంతా అస్తవ్యస్తంగా మారడమే కాదు.. పైసలు లేనిదే పనులు జరుగవనే పరిస్థితి వచ్చేసింది. జేఎన్టీయూ పరిధిలోని వివిధ కళాశాలల్లో రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం చాకచక్యంగా ఫైళ్లను పెడుతున్నారు. దీంట్లో భాగంగా 2019లో నిలిచిపోయిన 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పుడు చేపట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
అప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో భర్తీ ప్రక్రియ నిలిచింది. రోస్టర్, రిజర్వేషన్ ప్రక్రియలో వచ్చిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఆనాడు ప్రక్రియ ఆగింది. దీనికితోడు ఆనాడు యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీని యూనివర్సిటీలు కాకుండా ప్రభుత్వం చేపట్టేందుకు ప్రయత్నించడం, ఈ మేరకు గవర్నర్‌కు బిల్లు పంపడం, అది నిలిచిపోవడం తదితర కారణలతో ఆనాడు ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఆ ఫైలుకు ఇటీవల దుమ్ముదులిపి ఈనెల 7వ తేదీన ప్రభుత్వానికి యూనివర్సిటీ నుంచి లేఖ పంపారు. దీనికి అనుమతి కూడా తెచ్చుకొన్నారు. 2019 మార్చి రెండో తేదీన జారీ అయిన నోటిఫికేషనన్ ఆధారంగా ఇప్పుడు భర్తీ ప్రక్రియ చేపడుతున్నామని, ఆనాడు 18 మందికి ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయని, వారిని తీసుకోవడంతోపాటు మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని పాలకవర్గం చెప్తున్నది. నోటిఫికేషన్లో ఉన్న 32 పోస్టులను భర్తీ చేస్తామంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం.
గవర్నర్‌కు ఫిర్యాదుల వెల్లవ
జేఎన్టీయూలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, బంధుప్రీతిపై సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌కు కూడా అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ యూనివర్సిటీ అధికారులపై ఇప్పటికే గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని కూడా హెచ్చరించారు. అయినా వీరి వ్యవహారశైలిలో మార్పు రాలేదు. అత్యున్నత ప్రమాణాలకు నెలవుగా ఉన్న యూనివర్సిటీ ప్రతిష్ఠ ఇప్పుడు మసకబారుతున్నది. యూనివర్సిటీ కీలక పాలకుడు కొందరి చేతిలో కీలుబొమ్మగా మారారన్న ఆరోపణలున్నాయి.
నోటి దురుసుతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న యూనివర్సిటీ ఉన్నతాధికారి ఆయన భార్య జోక్యంతో అభాసుపాలవుతున్నారు. దీనికి తోడు కొత్తగా ఉన్నత బాధ్యతల్లోకి వచ్చిన ఓ మేడం తన స్థానాన్ని పదిలపర్చుకొనేందుకు ‘ఉపకులపతి’ని ప్రసన్నం చేసుకొని తన పనులు చక్కబెట్టుకొంటున్నారని గుసగుసలు. తాజాగా భారీ ఎత్తున పోస్టుల భర్తీకి తెరతీశారు. దీని కోసం పాత ఫైళ్ల దమ్ము దులుపుతున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టుతోపాటు రెగ్యులర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టేందుకు పావులు కదిపారు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొంటూ పనులు కానిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి.
రూ.30 లక్షలు వసూలు?
వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టు ఇవ్వాలంటే రూ.30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని, దీని కోసం ప్రత్యేక వ్యవస్థను తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ వ్యవస్థ ఇప్పటికే వసూళ్లలో నిమగ్నమైంది. కొంత మంది వద్ద నుంచి అడ్వాన్సులు తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇలా తీసుకొన్న సొమ్ము ఒకరిద్దరు యూనివర్సిటీ పెద్దల వద్ద డిపాజిట్ చేసినట్టు చెప్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ డిపాజిట్ రిలీజ్ చేసేలా ఒప్పందం చేసుకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పాత నోటిఫికేషన్‌తోనే భర్తీకి శ్రీకారం
కొత్త నోటిఫికేషన్‌తో ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో జేఎన్టీయూ అధికారులు కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. పాత నోటిఫికేషన్‌తో భర్తీ ప్రక్రియను కొనసాగిస్తే రాష్ట్రంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీకి ముందుకెళ్తే గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. దీనిపై కార్యాచరణను సిద్ధం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై ఇప్పటికే గవర్నర్ ఆరా తీసిన నేపథ్యంలో ఆయనకు నివేదించేందుకు సిద్ధమైనట్టు సమచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

