JNAFAU | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్‌పై అనేక ఆరోపణలొస్తున్నాయి. ఆయన వ్యవహారశైలిపై సర్కారుకు ఫిర్యాదులందాయి. ఇన్చార్జి వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. 2024 డిసెంబర్లో ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ గంగాధర్‌ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు వీసీ పోస్టు అప్పగించినట్టు ప్రచారంలో ఉన్నది. రేవంత్‌రెడ్డి అండదండలతోనే ఆయన వీసీ పదవిని చేజిక్కించుకున్నారని, దీంతో ఆయనేం చేసినా ఎవరూ కిమ్మనడంలేదన్న విమర్శలొస్తున్నాయి. దీంతో సీఎంకు ఫిర్యాదుచేశారు. కొన్ని ఆధారాలను సైతం అందజేసినట్టు సమాచారం. ఇన్చార్జి వీసీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలపై ఉన్నత విద్యామండలి ఆరా తీసింది. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ లేదా విజిలెన్స్ చేత విచారణ జరపనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆరోపణలు, ఫిర్యాదుపై ప్రొఫెసర్ గంగాధర్‌ను వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఫోనులో సంప్రదించగా స్పందించలేదు.