జిన్నారం, జనవరి 7 : సంగారెడ్డి జిల్లా జిన్నారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్ నారాయణ ఓ కవర్లో డబ్బులు తీసుకుంటున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లోని ప్యారడైజ్ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి నుంచి కవర్ తీసుకుంటున్న దృశ్యాలు జిల్లావ్యాప్తంగా సంచలనం రేపాయి. గడ్డపోతారంలోని 27 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు మద్దతుగా ఆక్రమణదారుల నుంచి ఆర్ఐ లంచం తీసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాజీపల్లిలోని 181 సర్వేనంబర్లోగల ప్రభుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణాల్లో ఆర్ఐ భారీగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ దేవదాసును వివరణ కోరగా చర్యల కోసం కలెక్టర్కు సిఫారసు చేసినట్టు పేర్కొన్నారు.