హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జిందం సత్తమ్మ అనే మహిళను ప్రపంచానికి పరిచయం చేశారు. ‘నా జిల్లాకు చెందిన ప్రత్యేకమైన టీఆర్ఎస్ మద్దతుదారు, ముఖ్యమంత్రి కేసీఆర్కు హార్డ్కోర్ అభిమానిని మీకు పరిచయం చేస్తున్నా. ఆమే.. జిందం సత్తమ్మ. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎలాంటి షరతులు లేని ఆమె ఆప్యాయత, మద్దతు చాలా అమూల్యమైనవి’ అని ట్వీట్ చేశారు.
ఆమెతో ఉద్యమ సమయంలో, స్వరాష్ట్రంలో మంత్రిగా వివిధ సందర్భాల్లో కలిసి దిగిన ఫొటోలను నెటిజన్లతో పంచుకొన్నారు. జిందం సత్తమ్మ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామం. ఈ ఊరు మిడ్మానేరు జలాశయం కారణంగా ముంపునకు గురైంది. దీంతో ఆమె అగ్రహారం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చదువుకోక పోయినా కేసీఆర్ ప్రసంగాలు విని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకొని ఉద్యమబాట పట్టారు. 2009 ఎన్నికల నుంచి ఇప్పటివరకు కేటీఆర్కు గట్టి మద్దతుదారుగా నిలిచారు. కేటీఆర్ పాల్గొనే అన్ని కార్యక్రమాలకు ఆమె హాజరవుతుండటం ఆయన పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనం.