హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అహింసా మార్గంలో పోరాడి సాధించిన తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని టాంజానియా పార్లమెంటు సభ్యుడు జెర్మియ కొనియాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ స్కాలర్ అయిన జెర్మియా తన పరిశోధన పత్రాలు సమర్పించేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ రామానుజారావు తదితరులు ఉన్నారు.