Teeth Whitening | దంతాలను తెల్లగా మార్చుకోవచ్చని చెబుతూ సోషల్ మీడియాలో ఎన్నో చిట్కాలు వైరల్ అవుతుంటాయి. చార్కోల్ పౌడర్ నుంచి పర్పుల్ టూత్‌పేస్ట్, ఆయిల్ పుల్లింగ్ వరకు అనేక పద్ధతులు తక్షణ ఫలితాలు ఇస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏవి నిజంగా పనిచేస్తాయి? ఏవి కేవలం అపోహలు? మరికొన్ని దీర్ఘకాలంలో దంతాల ఆరోగ్యానికి హానికరమా? అనే విషయాలను దంత ఆరోగ్య నిపుణులు వివరించారు. దంతాలపై ఏర్పడే మరకల స్వభావాన్ని బట్టి చికిత్స మారుతుందని, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి చిట్కాను నమ్మకూడదని వారు సూచిస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆధారిత ఉత్పత్తులు దంతాలను నిజంగా తెల్లగా మార్చగలవని నిపుణులు చెబుతున్నారు. ఇవి దంతాల రంగును బ్లీచ్ చేసి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. క్లినిక్‌లలో లేదా మెడికల్ స్టోర్లలో లభించే చాలా వైటెనింగ్ ఉత్పత్తుల్లో ఇదే ప్రధాన పదార్థంగా ఉంటుంది. అయితే దీని సాంద్రత సరైన మోతాదులో లేకపోతే చిగుళ్లకు ఇబ్బంది, చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాల సున్నితత్వం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల దంత వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ చికిత్స చేయించుకోవడం మంచిది.
బేకింగ్ సోడా దంతాలపై ఉండే పైపొర మరకలను కొంతవరకు తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్వల్ప రాపిడి గుణం వల్ల ఉపరితలంపై పేరుకుపోయిన మరకలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని టూత్‌పేస్ట్‌లలో దీనిని ఉపయోగిస్తారు. అయితే దీన్ని తరచూ లేదా బలంగా రుద్దడం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం పరిమితంగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో చేసే ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటిలో ఉండే ప్లాక్ కొంతవరకు తగ్గుతుంది. అయితే ఇది దంతాలను తెల్లగా మార్చే పద్ధతి కాదు. ముఖ్యంగా బ్రష్ చేయకుండా కేవలం ఆయిల్ పుల్లింగ్పైనే ఆధారపడితే నోటి పరిశుభ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనిని బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా, అదనపు అలవాటుగా మాత్రమే చూడాలి.
పర్పుల్ టూత్‌పేస్ట్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఇందులో ఉండే ఊదా రంగు పిగ్మెంట్లు దంతాలపై ఉండే పసుపు ఛాయలను తాత్కాలికంగా తగ్గించి దంతాలు మరింత తెల్లగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇది కేవలం కంటి మాయ మాత్రమే. దంతాల రంగులో శాశ్వత మార్పు తీసుకురాదు లేదా మరకలను తొలగించదు. సరైన విధంగా ఉపయోగిస్తే ఇది సురక్షితమే అయినప్పటికీ, దీన్ని అసలైన వైటెనింగ్ చికిత్సగా భావించకూడదు. యాక్టివేటెడ్ చార్కోల్ కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందిన చిట్కాల్లో ఒకటి. ఇది దంతాలపై ఉండే కొంత ఉపరితల మరకను తొలగిస్తుంది. కానీ దంతాల అసలు రంగును మార్చగలదనే శాస్త్రీయ ఆధారాలు లేవు. అంతేకాకుండా దీన్ని ఎక్కువకాలం ఉపయోగిస్తే రాపిడి వల్ల ఎనామెల్ క్రమంగా పలుచబడుతుంది. ఎనామెల్ దెబ్బతిన్న తర్వాత అది తిరిగి ఏర్పడదు. ఫలితంగా లోపలి పసుపు రంగు పొర బయటకు కనిపించి దంతాలు మరింత పసుపు రంగులో కనిపించే అవకాశం ఉంటుంది.
దంతాలను ఎక్కువకాలం తెల్లగా, ఆరోగ్యంగా ఉంచాలంటే ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాస్ ఉపయోగించడం, కాఫీ, టీ, శీతల పానీయాలను పరిమితంగా తీసుకోవడం అవసరం. పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా దంత వైద్యుడితో దంతాలను శుభ్రం చేయించుకోవడం మంచిది. దంతాల రంగులో నిజమైన, దీర్ఘకాలిక మార్పు కావాలంటే సోషల్ మీడియా చిట్కాల కంటే నిపుణుల పర్యవేక్షణలో చేసే వైటెనింగ్ చికిత్సే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.